Breaking News

దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో త్రిముఖ పోరు

  • టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు
  • ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్​

సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన సత్తాచాటుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం పలువురు నాయకులను రంగంలోకి దించి ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. ఇక బీజేపీకి చెందిన స్థానిక నేతలు కేంద్రప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రచారం చేసి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందుంది. టీఆర్ఎస్ గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ముందే ప్రకటించింది. టికెట్ విషయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట పాలానాధికారి పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరకు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సందేహాలకు తెరపడింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రచారం చేస్తోంది. దుబ్బాకలో లక్ష మెజార్టీతో గెలిచి తీరాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్​అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని కృతినిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రచారం పూర్తిచేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలంతా దుబ్బాకలో ప్రచారం చేయించేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్​లో ఎవరు?
ఇదిలాఉండగా, కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి ఎవరనే విషయం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే గజ్వేల్ మాజీఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డికి పార్టీ టికెట్ ఖరారు అయిందని ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా, మరొకరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ టికెట్ ఆశించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్​పార్టీలో చేరితే టికెట్​వస్తుందేమోనని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి ఎంతైతే సానుభూతి ఉంటుందో అదేస్థాయిలో మాజీమంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డికి కూడా దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది. ఇదిలాఉండగా, రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని టీఆర్ ఎస్​లోని ఓ వర్గం సమావేశాలు ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ పార్టీ అధిష్టానం రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్​కన్​ఫమ్​చేసింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు ట్రబుల్​షూటర్ గా భావించే మంత్రి హరీశ్​రావు రంగంలోకి దిగారు. ఈనెల 10 నుంచి ఎన్నికల నామినేషన్ ఉండడంతో ప్రచారంలో మరింత దూసుకుపోతున్నారు. చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.