Breaking News

దటీజ్ రమ్య..


సౌత్​లో అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషతో కలిపి దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించింది. ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సీరియళ్లు, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న రమ్య.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు తన ప్రాజెక్టుల వివరాలు చెప్పింది. ప్రజంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోందట. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘ఫైటర్’ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీ మరో బాహుబలి అవుతుందనే నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది శివగామి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ 50శాతం పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారట. బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టడం లేదని అడిగిన ప్రశ్నకు రమ్య మాట్లాడుతూ..‘నిజానికి నా సినిమాలకు బాలీవుడ్ లో ఆదరణ దక్కలేదు. నాకు వచ్చిన ఆఫర్లు కూడా సరైనవి కావు. అంతేకానీ హిందీ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని మాత్రం కాదు. ప్రస్తుతం సౌత్ లో సక్సెస్ ఫుల్ గానే రాణిస్తున్నా కదా’అని చెప్పింది. గతంలో రమ్య ‘ఖల్ నాయక్, క్రిమినల్, శాపత్, బడేమియా చోటేమియా’ వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులనూ అలరించింది. జయలలిత జీవితంపై తెరకెక్కిన ‘క్వీన్’వెబ్ సిరీస్‌ తో నటిగా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ, రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది రమ్య.