- ఆగస్టు 15 నుంచి వీడియో పాఠాలు
- ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉండేలా ప్లాన్
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డిజిటల్ బోధనను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక తరగతులకు వర్క్ షీట్స్, అసైన్‌మెంట్స్ ఇవ్వడంతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించారు. వీటిని టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా ఆగస్టు 15 నుంచి ప్రసారం చేసేలా కసరత్తు చేస్తోంది.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రజ్ఞత’ పేరుతో ఆన్‌లైన్, డిజిటల్ విద్యకు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టైం టేబుల్‌ను సిద్ధం చేసింది. ఇదిలాఉండగా, విద్యార్థులకు వచ్చే డౌట్స్‌ను నివృత్తి చేసేందుకు ఒక్కో తరగతికి ఒక్కోరోజు కేటాయించేలా చర్యలు తీసుకుంటోంది. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక గ్రామాల్లో ఉన్న విద్యార్థులు నేరుగా స్కూలుకు వెళ్లి నేర్చుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. దీని కోసం టీచర్లను రొటేషన్ పద్ధతిలో స్కూళ్లలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎంతమందిని ఉంచాలి.? మిగిలిన అంశాలపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.