Breaking News

తలరాతలు యిలానే ఏడుస్తాయి

తల రాతలు యిలానే ఏడుస్తాయి

విశ్వమంతా
హాయిగానే ఊపిరి
పీల్చుకుంటున్నది

ఏ మస్తిష్కమూ
భయ కీలలలో
తగలబడి పోవడం లేదు

కమురు వాసన
ఏ నాసికకూ
అతుక్కోవడం లేదు

ప్రజలు స్వేచ్ఛగా
దేహాలను విసిరేసు కుంటున్నారు

మృత్యు సముద్రంలో
శవాల జాడ లేదు
కొంగ్రొత్త రోగపు కడలిలో

పార్థివ శరీరాల ఉనికే లేదు

అవును
మీరు వింటున్నది నిజమే
మీ కర్ణేంద్రియాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి
లాహిరి లాహిరి లాహిరిలో
దేహాలు
సుఖాల కెరటాలపై
ఊయలలు ఊగుతూ ఉన్నాయి
ఎచ్చోటనూ
వసంతం
తనువు చాలించలేదు

పాపం
ఆవిడొక్కత్తి
యిందుకు మినహాయింపు

సామూహిక
శవదహనాలు

సగం కాలిన దేహాలు

ముద్ద దొరకని
ప్రజాస్వామ్య ప్రాణాలు

నడుస్తూనే
అగిపోతున్న ఊపిర్లు

ఇవేవీ
పతాక శీర్షికలు కావు
బలిసిన
అక్షరాలవ్వవు
ఏ మారుమూలో
కనీకనబడక
నక్కినక్కి దాక్కుంటాయి
కంటిని
భూగోళమంత
విప్పారిస్తేగానీ
దృశ్యం అర్థమవదు

అయ్యో!
అందానికి మబ్బు పట్టింది

వాయువు స్తంభించింది
అగ్ని శీతలమైంది
ఆకాశం తెర దహించుకపోయింది
నీరు ఘనీభవించింది
భూమి సహనాన్ని విడిచింది

మనం
కాటికేసి కాళ్లను
జాపినంత కాలం

శూన్యంలో
ఆలోచనలను
జారవిడిచినంత కాలం
రాతలు అలానే ఉంటాయి
తలరాతలు
యిలానే ఏడుస్తాయి

రండి !
లేవండి!
కదలండి!

అదిగో ….. అక్కడ
కిటికీలోంచి
కనబడుతున్న
శ్మశానంలో
ఎవ్వరిదో
పిడికిలి పైకి లేచింది

కదులుదాం !
ఆ పిడికిలికి
వేల గొంతులు మొలిపిద్దాం

దానిని
పచ్చని చెట్టును
చేద్దాం

చైతన్యపు గాలిని
విసురుదాం
ఈ నిస్తేజపు
నిశ్శబ్దాన్ని
నింగి నుంచి
విసిరేద్దాం!

:: సంబరాజు రవిప్రకాశ్ రావు
సెల్ నం.9491376255