Breaking News

తమిళనాడులో పాగా వేయాలని..

తమిళనాడులో పాగా వేయాలని..

సారథి న్యూస్​, హైదరాబాద్​: బీజేపీ.. సంప్రదాయ రాజ‌కీయాల‌ను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించ‌డమే లక్ష్యంగా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. త‌మిళ‌నాడులో పాగా వేసేందుకు చిర‌కాల కోరిక తీర్చుకునేందుకు అవ‌కాశం ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే త‌మిళ త‌లైవా.. ర‌జ‌నీకాంత్‌ను త‌న అండ‌దండ‌లు ఉంటాయ‌ని ప్రకటించింది. కానీ.. ర‌జనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొద‌లైంద‌ట‌. అక్కడ పార్టీ పెట్టిన విజ‌య్‌కాంత్ అడ్రస్​ లేకుండా పోయాడు. క‌మ‌ల్‌హాస‌న్ కూడా సొంత ఎజెండాతో జెండా పాతాల‌ని చూసినా ఎక్కడా అడుగు ప‌డ‌లేదు. దీంతో సినీతార‌లు చూపిస్తామంటున్న రాజ‌కీయ సినిమా ట్రయలర్​ కూడా మొద‌లుపెట్టలేకపోతున్నారు. దీంతో ఒళ్లుమండిన కాషాయ‌పార్టీ.. జ‌య‌ల‌లిత ప్రియ‌నేస్తం శ‌శిక‌ళ‌ను రంగంలోకి దింపాల‌ని ప్రయత్నిస్తోందట. అవినీతి కేసుల్లో ఇప్పటికే జైలుశిక్ష అనుభ‌విస్తున్న చిన్నమ్మ స‌త్ప్రర్తనతో కొద్దిరోజుల్లో విడుద‌ల కాబోతుందనే ప్రచారం ఊపందుకుంది. దీనివెనక కూడా బీజేపీ వ్యూహం ఉంద‌నే వాద‌న లేక‌పోలేదు.
వర్కవుట్​ అవుతుందా?
ర‌జ‌నీకాంత్‌పార్టీ పెట్టి.. రాష్ట్రంలో తిరిగి బ‌లం పుంజుకునేందుకు స‌మ‌యం ప‌డుతుంది. పైగా.. రాజ‌కీయంగా శ‌శిక‌ళ‌కు ఉన్నంత ఇమేజ్ లేదు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ కూడా అంతుబ‌ట్టకుండా ఉంది. జ‌య‌ల‌లిత ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆమెపై ఉన్న సానుభూతి వ‌ర్కవుట్​ అయితే చినమ్మ పార్టీ బాగా లాభ‌ప‌డుతుంది. స్టాలిన్ నేతృత్వంలో విప‌క్షంగా బ‌లంగా ఉంద‌ని భావించేందుకు లేదు. 2021 మే, జూన్ నెల‌ల్లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగాల్సి ఉంది. ఇంత తక్కువ స‌మ‌యంలో కొత్తపార్టీ ఏర్పాటుచేసినా రాష్ట్రవ్యాప్తంగా చుట్టిరావ‌డం చాలా కష్టమే. అందుకే సినీతార‌ల‌ను నమ్ముకోవడం పక్కనబెట్టి ఆల్ రెడీ పాపులారిటీ సాధించిన చిన్నమ్మకు స‌హ‌కారం అందించాల‌నేది కాషాయం ముంద‌స్తు వ్యూహ‌మ‌ట‌. మ‌రి ఈ విధంగానైనా ద‌క్షిణాదిన బీజేపీ ప‌ట్టు సాధించాల‌నే ఆశ‌యం నెర‌వేరుతుందా! లేదా అనేది 2021 నిర్ణయించాల్సి ఉంది.