Breaking News

తప్పిదమే ముంచింది

  • విశాఖలో స్టైరీన్​ గ్యాస్​ లీకేజీతో
  • 11 మంది మృత్యువాత
  • భయపెడుతున్న లీకేజీ ఉదంతాలు
  • మరుపురాని భోపాల్‌ దుర్ఘటన

సారథి న్యూస్, అనంతపురం: మానవ తప్పిదాలతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటిదే విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్​ పరిశ్రమలో స్టైరీన్​ విషవాయువు లీకేజీ ఘటన. ఈ దుర్ఘటనలో 11మంది మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎంతోమంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చింది. ఈ క్రమంలో కంపెనీలోని స్మోక్‌డిటెక్టర్ల నుంచి వచ్చిన సంకేతంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్‌ను నియంత్రించేందుకు వెళ్లారు. అప్పటికే దట్టంగా పొగలు కమ్ముకోవడంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో 101కి ఫోన్‌చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌లీకేజీని నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

నిర్జీవంగా మూగజీవాలు.. రంగుమారిన చెట్లు
గ్యాస్‌ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రహదారులపై పశువులతో పాటు పక్షులు, కోళ్లు ఎక్కడికక్కడ నిర్జీవంగా పడి ఉండటంతో విషాదఛాయలు అలముకున్నాయి. స్టైరీన్‌తీవ్రతకు చెట్లు సైతం నలుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపించాయి. అలాగే, పాములు కూడా బయటకు వచ్చి నిర్జీవంగా పడి ఉన్నాయి

ఈ గ్రామాల్లోనే అధిక ప్రభావం
ఎల్జీ పాలిమర్స్‌కంపెనీ నుంచి లీకైన స్టైరీన్‌విషవాయువు ప్రభావం ఐదు గ్రామాలపై అధికంగా ఉంది. గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం, పద్మనాభనగర్‌, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లో మొత్తం 10వేల కుటుంబాలు నివాసం ఉన్నాయి. వీరిలో దాదాపు రెండువేల మందికి పైగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌దళాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఉదయం ఐదు గంటల నుంచి ఇళ్లల్లో అచేతనంగా పడి ఉన్నవారిని తలుపులు బద్దలుకొట్టి మరీ బయటకు తీసుకొచ్చి ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్​లతో పాటు కార్లు, బైక్‌లపై క్షతగాత్రులను ఇతర ప్రాంతాలకు చేరవేశారు. జనావాసాల మధ్య అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తాజా ఘటన హెచ్చరిస్తోంది.

భోపాల్‌గ్యాస్‌ దుర్ఘటన
దేశంలో సంభవించిన అతిపెద్ద ప్రమాద ఘటనల్లో భోపాల్‌గ్యాస్‌దుర్ఘటన ఒకటి. మధ్యప్రదేశ్‌రాజధాని భోపాల్‌లో 1984 డిసెంబర్‌2వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి యూనియన్‌కార్బైడ్‌ఇండియా లిమిటెడ్‌(యూసీఐఎల్‌) పురుగు మందుల ప్లాంట్‌లో మిథైల్‌ఐసోసైనేట్‌గ్యాస్‌లీక్‌అయింది. దీంతో ఆ వాయువు పీల్చిన సుమారు 3,787 మంది మరణించారని మధ్యప్రదేశ్‌ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా సుమారు 5.5లక్షల మంది ఈ గ్యాస్‌ప్రభావానికి గురైనట్లు 2006లో ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

చెదరని చెర్నోబిల్‌ ఉదంతం
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణువిద్యుత్‌కేంద్రంలో 1986లో జరిగిన ఘటన మానవ చరిత్రలో ఒక అత్యంత దుర్ఘటనగా నిలిచిపోయింది. నిర్వహణ వైఫల్యంతో అక్కడి అణువిద్యుత్‌కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. అణుధార్మికతతో కనీసం రెండు లక్షల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ నిపుణులు అంచనావేశారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 1986 ఏప్రిల్‌26న జరిగిన ఈ ఘటనలో విద్యుత్‌ కేంద్రం భద్రతను పరిశీలించేందుకు ఇంజినీర్లు ప్రయోగం చేపట్టారు. ఈ కేంద్రం నుంచి వెలుబడిన రేడియో ధార్మికత స్వల్పకాలంలోనే కొన్ని వందల కిలోమీటర్లు వ్యాపించింది. ప్రమాదకర స్థాయిలో వస్తున్న పొగను నియంత్రించేందుకు అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన జరిగన వెంటనే దాని చుట్టుపక్కల 10 కి.మీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని నిషేధిత జోన్‌గా ప్రకటించారు. అనంతరం తీవ్రత దృష్ట్యా అణువిద్యుత్‌కేంద్రం చుట్టూ ఉన్న 30 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు లక్ష మందిని సుదూర ప్రాంతాలకు తరలించారు. దీంతో దీనికి సమీపంలో ఉన్న ప్రిప్యత్ నగరం మొత్తాన్ని మూసివేశారు. ఈ సమయంలో ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. దీనికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఇవ్వడంతో చాలామంది ప్రజలు తమ వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అంతేకాకుండా సంవత్సరాలపాటు ఆ ప్రాంతంపై నిషేధం ఉండడంతో చాలా మంది కొత్త ప్రాంతంలో నూతన జీవనం ప్రారంభించారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువగా మానసిక ఆరోగ్యం దెబ్బతిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ అక్కడ మానవ జీవనానికి అనువైన వాతావరణం లేదు.

ఫుకుషిమా
చెర్నోబిల్‌అనంతరం అత్యంత భారీ విపత్తుగా ఫుకుషిమా అణువిద్యుత్‌కేంద్రం ప్రమాదం నమోదైంది. జపాన్‌లో 2011లో సంభవించిన సునామీ కారణంగా ఈ దుర్ఘటన జరిగింది. భారీ సునామితో ఫుకుషిమా అణువిద్యుత్‌కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. భూకంపం ధాటికి రియాక్టర్లలో విద్యుత్ సరఫరా దెబ్బతిన్నది. అంతేకాకుండా బలమైన సునామీ అలల ధాటికి విద్యుత్‌కేంద్రంలోని చాలా రియాక్టర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ విద్యుత్‌కేంద్రంలో దెబ్బతిన్న రియాక్టర్ల నుంచి రేడియో అణుధార్మికత వెలువడింది. అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌కేంద్రం చుట్టూ 20కి.మీ వరకూ ఉన్న దాదాపు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణంతోపాటు చుట్టుపక్కల నీరు కూడా కలుషితమైంది. అంతేకాకుండా అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ దుర్ఘటన జరిగిన అనంతరం పుట్టిన పిల్లల్లో జన్యులోపాలతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కలుషితమైన ఈ అణువిద్యుత్‌కేంద్రాన్ని పూర్తిగా శుద్ధిచేయడానికి దాదాపు 30 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.