- మొదటిసారి జారీ చేసిన ట్విట్టర్
వాషింగ్టన్: ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ వాడడం వల్ల మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లకు ట్విట్టర్ ‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్ ఇచ్చింది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఆయన చేసిన రెండు ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోవాలని నెటిజన్లకు ట్విట్టర్ సూచించింది. ట్రంప్ ట్విట్లకు‘ఫ్యాక్ట్ చెక్’ వార్నింగ్‌ను ఇవ్వడం ఇదే మొదటిసారి.
ట్విట్టర్ వాడకంలో ట్రంప్ తన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఈ హెచ్చరిక ద్వారా పరోక్షంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో జరిగే అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో ‘మెయిల్ ఇన్ బ్యాలెట్’ పద్ధతిని అవలంబించాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్ నిర్ణయాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ‘మెయిల్ ఇన్ బ్యాలెట్’ ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు.
‘అది పెద్ద మోసం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిల్ బాక్సులను దొంగతం చేయొచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. అక్రమంగా ముద్రించవచ్చు. దొంగ సంతకాలు పెట్టొచ్చు. కాలిఫోర్నియా గవర్నర్ లక్షలాది బ్యాలెట్లను పంపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో చూడకుండా అందరికీ పంచేస్తున్నారు. అలా జరిగితే అది రిగ్గింగే’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.