అమెరికా అధ్యక్షుడు అప్పుడే చేతులెత్తేశాడా..? అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి పరాజయం పాలు కావడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చాడా..? అయితే, ఇండో–అమెరికన్లు ఈ సారి ట్రంప్ వెనుకే నడవాలనుకుంటున్నారా..? ఈ నిర్ణయమే ట్రంప్‌లో మళ్లీ విజయంపై ఆశలు రేపుతోందా…? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు ఏం జరగబోతోంది..?. ఇవీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే, ఇటీవల పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు నిజమేనన్న సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ‘వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోబోతున్నా. మాట్లాడడం కూడా చేతకాని జో బిడెన్ ఈ సారి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. అతడు మంచోడా, కాదా అనేది అనవసరం. కానీ అలాంటి వ్యక్తి అధ్యక్షుడుగా పనికిరాడు. నేను ఇప్పటివరకు ఎంతో చేశాను. అయినా, కొందరికి నేను నచ్చడం లేదు’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు ఓటమి తప్పదని నిన్నమొన్నటి వరకు అనేక సర్వేలు వెల్లడించాయి. 55 శాతం మంది బిడెన్‌కు మద్దతిస్తుండగా.. ట్రంప్‌నకు కేవలం 40 శాతం మందే మద్దతుగా నిలుస్తున్నారని సర్వేలు చెప్పాయి. దీంతో ఆయన ఆయన తీవ్ర నిరాశకు గురైనట్టుగా ఉన్నారు. కానీ, ఆ నిరాశ ఎంతో కాలం నిలవలేదు.
ఇండో అమెరికన్లు ఎవరి వైపు?
ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాలో ఉంటున్న ఇండియన్లు ఆయనకు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. ఈ సారి ఇండో అమెరికన్లు ట్రంప్‌నకు ఓటేస్తారని.. దీంతో ట్రంప్ విజయం సాధించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఇదే ట్రంప్‌లో మళ్లీ ఆశలు రేపుతోంది. ఇండో అమెరికన్లు తనకు మద్దతుగా నిలిస్తే తన విజయం ఖాయమన్న ధీమాలో ట్రంప్ ఉన్నారట. ప్రతిసారి డెమోక్రాట్లకు మద్దతుగా నిలిచే ఇండో అమెరికన్లు ఈ సారి రిపబ్లికన్ల వైపు మళ్లారని ఆ సర్వేలో తేలిందట. అయితే, హెచ్1బీ వీసాలు, అమెరికాలో నిరుద్యోగం పేరుతో ఇండియన్లను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ వైపునకు ఇండో అమెరికన్లు మళ్తతారా…? ఎప్పటిలాగానే మళ్లీ డెమోక్రాట్ల వైపే నిలబడతారా? అన్న అనుమానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇండో అమెరికన్లు ఎవరికి ఓటు వేస్తే వారి విజయం ఖాయమన్నది వాస్తవం. అయితే, వారు ఎటు వైపు మొగ్గుతారన్నది తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే మరి.