Breaking News

టీ20 వరల్డ్​ కప్​ అసాధ్యమే

సిడ్నీ: స్టేడియాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​కు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ సమయంలో మెగా ఈవెంట్ వాస్తవరూపం దాల్చేలా లేదని సీఏ చైర్మన్ ఎల్ ఎడ్డింగ్స్ అన్నాడు. 16 జట్లను ఆసీస్​లోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించడం కష్టసాధ్యమైన పని అని వెల్లడించాడు.

‘ఇప్పట్లో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 16 టీమ్​లు ఆసీస్​కు వచ్చి ఇక్కడి నిబంధనలు పాటించాలంటే కొద్దిగా కష్టమే. క్రికెట్ ఆడే చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. షెడ్యూల్ సమయానికి ఈ కేసులు అదుపులోకి వస్తాయో లేదో తెలియదు. కాబట్టి ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో టోర్నీ నిర్వహించడం వాస్తవం అనిపించడం లేదు’ అని ఎడ్డింగ్స్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఎడ్డింగ్స్ వ్యాఖ్యలు బీసీసీఐలో ఉత్సాహాన్ని నింపాయి. సెప్టెంబర్, అక్టోబర్ విండోలో ఐపీఎల్ నిర్వహణకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తోంది.