- ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
సారథి న్యూస్, మెదక్: వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి జూన్ 10వ తేదీ నాటికి రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో రైతులకు నియంత్రిత సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతులకు రైతుబంధు కోసం రూ.ఏడువేల కోట్లు అవసరం ఉండగా, ఇప్పటికే రూ.3,500 కోట్లు వ్యవసాయశాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు అవసరం ఉండగా, అవసరమైన నిధుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ తదితర ప్రజాప్రతినిధుల జీతాలలో కోత విధిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ ఒకే రకం పంట వేసి ఆగమాగం కావొద్దని, డిమాండ్‌కు అనుగుణంగా పంటలు చేసేలా చూడటం, తద్వారా పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కేలా చూడడం కోసమే నియంత్రిత వ్యవసాయ విధానానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని తెలిపారు. రైతుల పొలాల్లో రూ.500కోట్ల వ్యయంతో సీసీకల్లాలను ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మెదక్ లో కొత్తగా నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ సమీపంలో రూ.25కోట్ల వ్యయంతో 30వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న భారీ గోదాం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
మెదక్ సమీపంలో రెండొందల ఎకరాల్లో ఆగ్రో ఇండస్ట్రీట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. నిజాంపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, మెదక్ మున్సిపాలిటీకి కొత్తగా మంజూరైన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్, నర్సాపూర్, అందోల్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, వైస్ చైర్మన్ లావణ్య, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఏవో పరుశరాం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు పాల్గొన్నారు.