న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ప్రతి 12 నుంచి 13 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు. జులై చివరి నాటికి 5.5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నందున 80వేల బెడ్లు అవసరం అవుతాయని చెప్పారు. హాస్పిటల్స్ విషయంలో ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడంపై పునరాలోచించాలని ఎల్‌జీని కోరామని, ఆయన దానికి ఒప్పుకోలేదని చెప్పారు. కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు ఢిల్లీలో కరోనా వైరస్ కమ్యూనిటీ స్ర్పెడ్ లేదని సిసోడియా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయిన అనంతరం ఈ విషయం చెప్పారు. కమ్యూనిటీ స్ర్పెడ్ ఇంకా మొదలు కాలేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారని ఆయన అన్నారు. పాజిటివ్ వచ్చిన కేసుల్లో దాదాపు 50 శాతం సోర్స్ తెలియదని, దీనికి సంబంధించి కేంద్రం స్పష్టత ఇవ్వాలని హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందన్నారు.