Breaking News

చైనా దూకుడుకు చెక్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఇండియా, చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాల్వాన్​లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. కాగా గాల్వాన్​ ప్రాంతంలో చైనాకు చెక్​పెట్టేందుకు భారత్​ కీలక అడుగు వేసింది. గల్వాన్ నదిపై భారత సైనిక ఇంజినీర్లు వంతెన నిర్మాణం పూర్తి చేశారు. 60 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిపై నుంచి ఆర్మీ వాహనాలు ఈజీగా నదిని దాటుతాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గల్వాన్ నదిపై ఇప్పటి వరకు జవాన్లు కాలినడకన వెళ్లేందుకు మాత్రమే వంతెన ఉండేది. ఇప్పుడు వాహనాలు సైతం వెళ్లేలా కూడా బ్రిడ్జి నిర్మించడంతో అక్కడ మరింత నిఘా పెంచవచ్చు. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చైనా ఆర్మీ ఎంతో ప్రయత్నించి విఫలమైంది. బ్రిడ్జి నిర్మిస్తున్నారనే అక్కసుతోనే ఉద్దేశ్వపూర్వకంగా గొడవలకు దిగింది. ఈ క్రమంలోనే అక్కడ కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐతే చైనా ఎంత దూకుడు ప్రదర్శించినప్పటికీ.. భారత్ వెనకడుగు వేయలేదు. గల్వాన్ లోయపై బ్రిడ్జి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. లోయలో రోడ్లు, నదిపై బ్రిడ్జి నిర్మించిన నేపథ్యంలో గల్వాన్‌లో సైనిక కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. ఈ క్రమంలో ఆర్మీ వాహనాలు, ఆయుధాలను తరలించి చైనాక ధీటైన జవాబు ఇవ్వవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు.