సారథి న్యూస్, మెదక్: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ కొన్ని గ్రామాలు, తండాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయని అన్నారు. చిన్నతనంలోనే పెళ్లిచేస్తే వారి మానసికస్థితి ఎదగకపోవడంతో సమస్యలు వస్తాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తతెత్తకుండా మెదక్ జిల్లాలో సఖి సెంటర్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, కిషోరబాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని, అందుకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందచేయాలన్నారు.
మెదక్ డీడబ్ల్యూవో షేక్ రసూల్బీ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలకు పోషకాహారాన్ని అంగన్వాడీ సెంటర్లలో అందిస్తున్నామని వివరించారు. గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో వెంకటేశ్వర్లు, డీఎస్పీ కృష్ణమూర్తి, ఐసీడీఎస్ సీడీపీవోలు పద్మావతి, హేమభార్గవి, భార్గవి, స్వరూప, సూపర్వైజర్లు, సఖిసెంటర్ బాధ్యులు పద్మలత, కరుణశీల పాల్గొన్నారు.