Breaking News

చితికిన చిరు వ్యాపారులు

చితికిన చిరు వ్యాపారులు

  • ఆదుకోని ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ
  • దివాళా తీసిన వ్యాపారాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో తోపుడు బండ్ల వారి నుంచి మధ్య తరగతి వ్యాపారుల వరకూ అందర్నీ ఆదుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన.. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ, వారిలో ఆత్మ నిబ్బరాన్ని పెంచలేకపోయింది. రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో ఆయా వ్యాపారులకు ఒక్క పైసా రాలేదు. దేశంలో మార్చి 25న లాక్‌డౌన్‌ విధించగా.. గత శుక్రవారం నాటికి సరిగ్గా ఆర్నెళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందరో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వారు ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ కింద వీరికి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో వ్యాపారాలు దివాళా తీశాయి. ఫలితంగా కుటుంబపోషణ కష్టంగా మారడమేగాక జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, రెడీమేడ్‌ దుస్తులు, చెప్పుల షాపులు, టిఫిన్‌ సెంటర్లు, చిన్న హోటళ్లు, హార్డ్‌వేర్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, బంగారు, వెండి ఆభరణాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, మొబైల్‌ ఫోన్లు, చిన్నతరహా మందుల షాపులు, కూరగాయల బండ్లు, కిరాణా, జనరల్‌ సోర్లు తదితర 29 రకాల వ్యాపారాలు తలకిందులయ్యాయి. వాటి మీద ఆధారపడి బతుకున్నవారిలో ఇప్పటి వరకూ ఏడు శాతం మంది తమ దుకాణాలు, షాపులను శాశ్వతంగా మూసివేశారు. కరోనా, దాని వల్ల విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 శాతం వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఒక సర్వేలో తేలింది.

ఆందోళనలో చిరువ్యాపారులు
దేశంలో ఇప్పుడు అన్‌లాక్‌ విధానం అమలవుతున్నా.. దుకాణాలు, షాపులకు రావడానికి జనం జంకుతున్నారు. ఈ క్రమంలో ఒకవైపు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయాలు అందకపోవడం, మరోవైపు కొనుగోళ్లపై వినియోగదారులు ఆసక్తి చూపకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని సికింద్రాబాద్‌ జేమ్స్‌ మార్కెట్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారి ఆవేదన వ్యక్తంచేశాడు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం చిరు, మధ్య తరగతి వ్యాపారాలే కావడం గమనార్హం. ఈ వ్యాపారులంతా తమ దుకాణాల ద్వారా తాము జీవనోపాధి పొందడమేగాక రాష్ట్రంలో అనేక వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. క్రమం తప్పకుండా పన్నులు చెల్లించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న చిరు, మధ్య తరగతి వ్యాపారాలు, వాటి యజమానులను ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ ఆదుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తమను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, వీధుల్లో వస్తువులు అమ్ముకునేవారు, తోపుడు బండ్ల వారికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని తెలంగాణ స్టేట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ (ఎఫ్‌ఫ్యాప్సీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు ఎఫ్‌ఫ్యాప్సీ అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్‌ ప్రధాని నరేంద్రమోడీకి శుక్రవారం లేఖ రాశారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకూ ఆదుకోవాలని కోరారు.