న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత వెయిట్ లిఫ్టర్ సంజితా చానూపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంతర్జాతీయ సమాఖ్య(ఐడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. శాంపిల్స్‌ను విశ్లేషించే క్రమంలో సరైన పద్ధతులను పాటించలేకపోయామని స్పష్టంచేసింది. ఈ మేరకు నాడా చేసిన ప్రతిపాదనల ప్రకారం చానూపై ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఐడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.
తుది తీర్పుకు సంబంధించిన కాపీని ఈ మెయిల్ ద్వారా లిఫ్టర్కు పంపించామని చెప్పింది. అయితే ఏ తప్పుచేయని తనను మానసిక క్షోభకు గురిచేశారని, అందుకు తగిన మూల్యం చెల్లించాలని చానూ ఐడబ్ల్యూఎఫ్ ను డిమాండ్ చేసింది. ‘డోపింగ్ వివాదం నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉంది. కానీ దానివల్ల చాలా అవకాశాలను కోల్పోయా. ఎంతో క్షోభను అనుభవించా. ఇప్పుడేమో చర్యలు లేవని సాఫీగా సమాధానం చెబుతారా. మీరు చేసిన తప్పు వల్ల నా ఒలింపిక్ అవకాశాలపై దెబ్బ పడింది. ఇందుకు పరిహారం చెల్లించాలి’ అని చానూ వ్యాఖ్యానించింది.