Breaking News

చకచకా రైతువేదిక పనులు

చకచకా రైతువేదిక పనులు

సారథి న్యూస్, వెల్దండ: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా ఇటీవల నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయ సంబంధిత విషయాలను చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికల నిర్మాణాలు నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో షురూ అయ్యాయి. ఒకటి రెండు గ్రామాల్లో ఇప్పటికే పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నాయి.

రైతులు కూర్చుకునేందుకు వీలుగా హాలు నిర్మాణ పనులు

చర్చించుకునేందుకు వీలుగా..
రైతులంతా ఓ చోట చేరి వ్యవసాయం, మార్కెటింగ్‌, వ్యవసాయ పద్ధతులు, ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు, మార్కెటింగ్ ​సౌలభ్యం తదితర అంశాలపై చర్చించుకునేందుకు వీలుగా 2,046 చదరపు అడుగుల్లో ఒక హాల్‌, రెండు గదులు, మరుగుదొడ్డి తదితర వసతులు ఉండేలా ఒక్కో రైతు వేదికను రూ.22లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. అగ్రికల్చర్​ అధికారులు, రైతులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌, సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మీటింగ్​ నిర్వహించేందుకు వీలుగా 1,498 చదరపు అడుగుల వేదికతో 154 మంది కూర్చునేలా హాలును నిర్మిస్తున్నారు. పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి వీలుగా గోడౌన్ ​నిర్మిస్తున్నారు.

కొట్ర గ్రామంలో చివరి దశలో ఉన్న రైతు వేదిక పనులు

9 గ్రామాల్లో రైతు వేదికలు
వెల్దండ మండలంలోని వెల్దండ, కొట్ర, చెర్కూరు, పెద్దాపూర్, బైరాపూర్, బొల్లంపల్లి, పోతేపల్లి, అజిలాపూర్, కుప్పగండ్ల గ్రామాల్లో రైతువేదికల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే కొట్ర గ్రామంలో ఇప్పటికే 95శాతం పనులు పూర్తయ్యాయి. హాల్​లో బండలు పర్చడంతో పాటు సిమెంట్, పైకప్పు రేకులు బిగించే పనులు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఇక రంగులు వేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యే చేత ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.


ఇక ఓపెనింగే మిగిలింది

రైతుల సౌకర్యార్థం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదిక పనులు మా గ్రామంలో 95 శాతం మేర కంప్లీట్ ​అయ్యాయి. దాదాపు నిర్మాణ సంబంధిత పనులు పూర్తయి.. చివరిగా రంగులు వేసే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వర్షాలు కురవకపోతే అవి కూడా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిచేస్తాం. వానాకాలం పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. జిల్లాలోనే ప్రప్రథమంగా మా గ్రామంలోనే పూర్తి చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.
:: పి.వెంకటేశ్వర్​రావు, కొట్ర సర్పంచ్, వెల్దండ మండలం