Breaking News

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

సారథి న్యూస్, చౌటుప్పల్‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ఆవు అడ్డుగా రావడంతో డ్రైవర్లు సడన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్​లోని వాహనాలు ఢీకొన్నాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని పక్కకు తప్పించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామం వద్ద 65వ నంబర్​ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

దెబ్బతిన్న కాన్వాయ్​లోని వాహనం

ఏం జరిగిందంటే..
ఏడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌ వెహికిల్స్​లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు వస్తున్నారు. ముందు మూడు, వెనక మూడు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు ఉండగా, మధ్యలోని బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఆయన మార్గమధ్యంలోని దండుమల్కాపురం వద్దకు కాన్వాయ్‌ రాగానే ఆవు హైవేపైకి వచ్చింది. కాన్వాయ్‌లోని మొదటి వాహనం డ్రైవర్‌ ఇది గమనించి సడన్‌ గా బ్రేక్‌ వేశాడు. ఆ వెంటనే రెండో వాహనం డ్రైవర్‌ సైతం బ్రేక్‌ వేశాడు. మూడో వాహనం బుల్లెట్‌ ప్రూఫ్‌ కాకపోవడంతో ఆగకుండా ముందుకు వెళ్లి రెండో వాహనాన్ని ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు వాహనం డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి పక్కకు తప్పించాడు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఢీకొన్న వాహనం ముందుభాగం ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చంద్రబాబునాయకుడు వాహనం నుంచి కిందికి దిగి పరిస్థితిని సమీక్షించి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిపోయారు.