- ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ధ్యేయమని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఎత్తు పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ శివారులోని వాగుపై సుమారు రూ.ఏడుకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎడారిగా మారిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్ ఎత్తు పెంచేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, భవిష్యత్‌లో కర్వెన రిజర్వాయర్ నుంచి కోయిల్ సాగర్‌కు ప్రతినెలా టీఎంసీ నీటిని తీసుకెళ్లేందుకు డిజైన్ ను కూడా రూపొందించినట్లు తెలిపారు. రామన్‌పాడ్ వరకు జలకళ సంతరించుకునేలా చెక్ డ్యామ్‌లను మంజూరు చేశారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుంచి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.