సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ఊపందుకున్నాయి. కొత్త సెక్రటేరియట్ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. అయితే నిర్మాణ సంస్థలు డిజైన్లను కూడా రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సచివాలయ భవన నిర్మాణం దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చ. అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. భవనానికి అత్యంత విశాలంగా 2 మీటర్ల మేర ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేస్తారు. ద్వారం మధ్యలో తెలంగాణ కలికితురాయిలా ఓ పెద్ద గవాక్షాన్ని నిర్మించనున్నారు. పెద్దపెద్ద కారిడార్లు, గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా భారీ వరండాలతో డిజైన్‌ను రూపొందించారు. కొత్త భవనం ముఖద్వారం తూర్పు వైపుగా ఉండి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశద్వారం ఉండేలా ఈ నిర్మాణం జరుగుతుంది. భవనం మధ్యలో చెట్లు, పచ్చికబయళ్లతో కూడిన రెండు పెద్దవరండాలు లోపల వెలువడే కర్బన వ్యర్థాలను తగ్గించే విధంగా ఉంటాయి. ఎదురుగా ఉండే హుస్సేన్ సాగర్ మీదుగా వీచే గాలులు లోపలికి ప్రవేశించి, భవనం ఎల్లప్పుడూ చల్లగా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త సెక్రటేరియట్ రూఫ్ టెర్రేస్, పార్కింగ్ రూఫ్ టాప్ లపై సోలార్ ప్యానళ్ల అమరికతో సౌర విద్యుత్‌ను వాడుకునేలా నిర్మాణం ఉంటుంది. భవనం మొత్తం ధారాళంగా గాలి ప్రసరించి సహజమైన చల్లదనం ఉండేలా, లోపల ఉండే భారీవరండాలు స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు దోహదపడేలా ఏర్పాట్లు చేస్తారు.
గుడి, బడి, పార్కింగ్, గ్రీనరీ
కాంప్లెక్స్ లో ఓ శిశుసంరక్షక కేంద్రం, ఆలయం, మసీదు, ఇతర ప్రార్థనా మందిరాలు, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, బ్యాంకులు, ఏటీఎంలకు ప్రత్యేక భవనాలు, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ తదితర సౌకర్యాలు కూడా ఉండేలా నమూనాను రూపొందించారు. సచివాలయం పార్కింగ్ లో ఒకేసారి 500 కార్లు, విజిటర్స్ పార్కింగ్ లో మరో 300 కార్లు పార్క్ చేసేలా వెసులుబాటు కల్పిస్తూ కొత్త నిర్మాణం చేపడతారు. ప్రాంగణంలోని పార్కింగ్ బేలు మంచి గ్రీనరీతో సందర్శకులను ఆకర్షించేలా, చూపరులకు ఆహ్లాదం కలిగించేలా ఉంటాయి.
ప్యాలెస్ ఆఫ్ వర్సెల్స్ స్ఫూర్తి
సైట్లో 60శాతం స్థలం, అందమైన పచ్చికబయళ్లతో కూడి, కర్బన రసాయనాలను నియంత్రించేలా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరిచేలా ఉంటుంది. ఫ్రాన్స్ లోని ప్యాలెస్ ఆఫ్ వర్సెల్స్ స్ఫూర్తిగా పచ్చికబయళ్లు భవనానికి ఈశాన్యం, ఆగ్నేయం మూలల్లో ఉండేలా నిర్మాణం జరుగుతుంది. రెండు ల్యాండ్ స్కేప్ ల్లో రెయిన్ వాటర్ హార్వెస్టర్లను ఏర్పాటు చేస్తారు. మధ్యలో తెలంగాణ అధికారిక పువ్వు తంగేడు ఆకారంలో వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో, కృత్రిమ విద్యుత్ దీపాలు అవసరం లేకుండా సహజమైన వెలుతురుపడేలా ఉంటుంది. భవనం మొత్తం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో నిర్మితమవుతుంది. స్మార్ట్ లైటింగ్ కంట్రోళ్లు, మోషన్ సెన్సార్లు, ఆటోమాటిక్ స్విచ్‌లు, టైమర్లు, డిమ్మింగ్ కంట్రోళ్లు లాంటి హంగులన్నిటినీ ఏర్పాటు చేస్తారు.
వివిధ డిజైన్ల పరిశీలన
సమీకృత కొత్త సచివాలయం కోసం చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ రూపొందించిన నమూనా దాదాపు ఖరారైనట్లే. ఈ డిజైన్ త్వరలో సీఎం కేసీఆర్ ఆమోదం కూడా పొందనుంది. రూ.500 కోట్ల వ్యయంతో సమీకృత సచివాలయం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం 10 డిజైన్లలో ఆర్ అండ్ బీ శాఖ మూడింటిని సీఎం ముందుంచింది. వాటిలో ఒకదాన్ని ముఖ్యమంత్రి సెలెక్ట్ చేయనున్నారు. ఇక కొత్త నిర్మాణంలో ఫీచర్స్ ఒకసారి చూస్తే, ఇది పూర్తి వాస్తు ప్రకారం రూపొందించిన డిజైన్. అత్యుత్తమ దక్షిణభారత సంప్రదాయంలో, డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సచివాలయ భవన నిర్మాణం తెలంగాణకు తలమానికంగా ఉంటుంది. మనోహరమైన కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణ స్మారక చిహ్నంగా సమీకృత కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. మొత్తం 25 ఎకరాల స్థలంలో కేవలం 20శాతం మాత్రమే సమీకృత భవన నిర్మాణానికి, మిగిలిన 80 శాతం ఉద్యానవనానికి, ఫౌంటైన్ల కోసం వినియోగించనున్నారు.