Breaking News

కొత్త మేనేజ్​మెంట్​తో లాభమే

కరాచీ: కొత్త మేనేజ్​మెంట్​ రాకతో పాక్ జట్టు కొత్తగా కనిపిస్తోందని స్పిన్ కన్సల్టెంట్ ముస్తాక్ అహ్మద్ అన్నాడు. తనతో పాటు చీఫ్ కోచ్ మిస్బా, బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ రాక టీమ్​కు మరింత బలం చేకూరుస్తుందన్నాడు. అయితే కొత్త ప్లేయింగ్ కండీషన్స్​లో ఆడడానికి ఆటగాళ్లకు కొంత సమయం పడుతుందన్నాడు. ‘కొత్త అలవాట్లను క్రమంగా అలవర్చుకోవాలి. ఒక్కసారే మార్పు రాదు. సిరీస్​కు చాలా ముందే మేం ఇంగ్లండ్ వెళ్తాం. కాబట్టి అక్కడే ఎదురయ్యే సవాళ్లపై ఆటగాళ్లకు అవగాహన కల్పిస్తాం’ అని ముస్తాక్ పేర్కొన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మొదలయ్యాకా.. నైపుణ్యం కంటే మానసికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యమైందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెంటర్స్ పాత్ర కీలకం కానుందన్నాడు. ‘ఇంగ్లండ్‌, విండీస్‌ సిరీస్‌ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌లు ఎలా ఆడాలి. ప్లేయర్లతో ఎలా మెలగాలి. స్టేడియంలో ఎలా ఉండాలనే అంశాలపై ఓ అవగాహన వస్తుంది. ఆట నైపుణ్యం కంటే ఇప్పుడు ఇవే ఎక్కువ అవసరం. అందుకే ప్రతి ప్లేయర్‌ మానసికంగా బలంగా మారాలి’ అని ముస్తాక్ వ్యాఖ్యానించాడు. ఏడాది కాలంలో ప్రపంచ క్రికెట్‌ మొత్తం సాధారణ స్థితికి చేరుకుంటుందన్నాడు.