Breaking News

కొత్త పంథా.. సరికొత్త ఒరవడి

  • వైఎస్​ జగన్‌ పాలనకు నేటితో ఏడాది పూర్తి
  • అన్ని సామాజికవర్గాలకు బాసటగా సర్కారు
  • విద్య, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యరంగాలకు పెద్దపీట
  • దేశానికే ఆదర్శంగా ‘దిశ’ చట్టం రూపకల్పన
  • టెండర్ల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం

సారథి న్యూస్, అనంతపురం: ‘జగన్‌ అనే నేను..’ అభిమాన జనం.. జయజయధ్వానాల మధ్య ఆ మాట వినిపించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నో సంక్షేమ పథకాలు.. మరెన్నో సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్​ ప్రగతిని పట్టాలెక్కించారు. వినూత్న పథకాలతో కొత్త ఒరవడితో ముందుకుసాగుతున్నారు. అనుభవజ్ఞులను మించిన ‘మంచి సీఎం’ అంటూ కితాబు అందుకున్నారు వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి. ఏడాది పాలనలో వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్​ను రూ.2,250కు పెంచుతూ మొదటి సంతకం చేసి ‘ఎన్నికల మేనిఫెస్టో’ అమలులో తొలి అడుగువేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు.
విద్య నుంచి ఉపాధి దాకా..
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణల అమలుకు నడుం బిగించారు. పిల్లలందరినీ స్కూళ్లకు పంపించేలా తల్లులకు ఆర్థికంగా ఊతమిచ్చేలా ‘అమ్మ ఒడి’ కింద రూ.15వేలు ఇవ్వడంతో పాటు ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్‌లు తదితర వాటిని సమకూర్చేలా ‘విద్యా కానుక’.. ఉన్నత చదువులను నిరుపేద విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌ చేయడానికి ‘విద్యాదీవెన’.. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు వసతి, హాస్టల్‌ ఖర్చుల కోసం ‘వసతి దీవెన’ పథకాలు ప్రారంభించారు. యువతకు గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు, 2.75 లక్షల మందిని వలంటీర్లుగా నియమించారు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసి ఉపాధిపై భరోసా కల్పించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
ప్రైవేట్​ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ‘నాడు.. నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి రూ.ఐదులక్షల ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వైద్య చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటితే.. వాటిని ఆరోగ్యశ్రీ కింద చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. బెల్టు షాపులను తగ్గించారు. కరోనాను అరికట్టడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలోనూ సఫలీకృతమయ్యారని సామాజికవేత్తలు అభినందిస్తున్నారు.
పక్కాగా మేనిఫెస్టో
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా 341 రోజులపాటు 3,648 కి.మీ.మేర నిర్వహించిన పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అని భరోసా ఇస్తూ ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 50 శాతం ఓట్లతో.. 86 శాతం శాసనసభ.. 92 శాతం లోక్‌సభ స్థానాలను దక్కించుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం దేశం యావత్తు మనవైపు చూసేలా ‘దిశ’ చట్టం చేశారు.
పండగలా వ్యవసాయం
పెట్టుబడులకు రైతులు ఇబ్బందులు పడకుండా ‘రైతుభరోసా’ కింద ఏటా రూ.13,500 ప్రభుత్వం అందజేస్తోంది. రాయితీపై విత్తనాలు, ఎరువులను సరఫరా చేస్తోంది. వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల సాగులో సలహాలను అందజేస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం సర్కారే కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారులు కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి నుంచి పంట కొనుగోలు వరకూ.. రైతుకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుండడంతో వ్యవసాయం పండగలా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదీ జలాలను ఆయకట్టుకు అందించడంలో సర్కార్‌ విజయవంతమైంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయడం.. నదీ వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములను సుభిక్షం చేసి.. రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉన్న నామధేయానికి సార్థకత చేకూర్చడం కోసం పంచశీల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్‌ పనుల్లో పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి.. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా తొలి ఏడాదిలోనే రూ.2,080 కోట్లను ఖజానాకు మిగిల్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
పారిశ్రామికాభివృద్ధికీ పెద్దపీట వేస్తున్నారు. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించేలా చేశారు. దీనివల్ల 34,822 మందికి ఉపాధి దొరికిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఏడాదిలో 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పడినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. వీటి ద్వారా రూ.2,503 కోట్ల పెట్టుబడితో 63,897 మందికి ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నాయి.