సారథి న్యూస్, మెదక్: కొండా లక్ష్మణ్‌బాపూజీ నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణి హాల్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
బాపూజీ న్యాయవాద వృత్తిని చేపట్టిన సమయంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారికి మద్దతుగా వాదించేవారని గుర్తు చేశారు. అంతకుముందు కొండా లక్ష్మణ్‌బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి జగదీష్, బీసీ సంఘాల నాయకులు మేకల జయరాములు, భద్రయ్య, మెట్టు గంగారాం, శివశంకర్, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.