Breaking News

‘కైలాస్‌’ అరెస్టు వెనక రాజ‘కీ’యం?

‘కైలాస్‌’ అరెస్టు వెనక రాజ‘కీ’యం?

  • ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు
  • ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు

సారథి న్యూస్​, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాస్‌ నాయక్‌ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అందుకు ఎకరాకు రూ.18క్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇదే సర్వేనంబర్​లో కైలాస్‌ నాయక్‌కు కూడా ఐదెకరాల స్థలం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.18 లక్షలు ఇచ్చిన నేపథ్యంలో తనకు సగం మొత్తం చెల్లించాలని బెదిరింపులకు ప్పాడినట్లు రుద్రవరంలో భూములు ఉన్న శివనాయక్‌(ఈయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఉంటాడు) అనే వ్యక్తి కర్నూలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కేసు నమోదైంది. కానీ ఆ ఫిర్యాదు తాను ఇవ్వలేదని, రాజకీయ నాయకులు కొందరు కావాలనే తన పేరుతో కేసు నమోదయ్యేలా చేశారని, ఇదంతా ఓ ప్రజాప్రతినిధి కనుసైగతో జరిగిందని సదరు వ్యక్తి శివనాయక్‌ శుక్రవారం మీడియా ముందు వెల్లడించడం విస్మయానికి గురిచేసింది. తన పేరుతో నమోదైన కేసును విత్‌ డ్రా చేసుకుంటానని, రాజకీయంగా కైలాస్‌ నాయక్‌ను ఎదుర్కోలేక ఇలా ఇరికించారని ఆరోపించారు. లంబాడీ హక్కుకోసం ఎన్నో ఉద్యమాలు చేసి తమకు సమాజంలో గుర్తింపు తెచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కైలాస్‌ నాయక్‌పై పెట్టిన కేసును ఎత్తివేయాని, ఈ విషయంలో ఎస్పీ ఫక్కీరప్పను కలుస్తానని శివనాయక్‌ స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కైలాస్‌ నాయక్‌ను అరెస్ట్​చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన శివనాయక్‌.. వెంటనే కైలాస్‌ నాయక్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.