Breaking News

కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

కిరాణాషాపు.. అగ్నికి ఆహుతి

సారథి న్యూస్, వెల్దండ: రెక్కల కష్టం బుగ్గిపాలైంది.. పైసాపైసా పోగేసి దాచుకున్న సొత్తు అగ్గిపాలైంది.. తాము నమ్ముకున్న కిరాణాషాపునకు మంటలు అంటుకోవడంతో బతుకంతా రోడ్డున పడినట్లయింది. నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన కొప్పు మల్లేష్, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఊరిలోనే డబ్బాలో చిన్నపాటి కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకుని.. అందులో చికెన్, గుడ్లు, కూల్​డ్రింక్స్, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రమాదవశాత్తు బుధవారం అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న రిఫ్రిజరేటర్, కూల్​డ్రింక్స్, కోళ్లు, నగదు, కిరాణా సామాను, కుర్చీలు కాలిబూడిదయ్యాయి. ఫ్రీజ్​, కూల్​డ్రింక్స్ ​కలుపుకుని సుమారు రూ.4లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని కొప్పు మల్లేష్, రజిత దంపతులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్​పి.వెంకటేశ్వర్​రావు, ఎంపీటీసీ సభ్యుడు రాములు, బీజేపీ నాయకులు జె.బాలస్వామి, మాజీ ఉపసర్పంచ్​బి.రామస్వామి, వార్డు సభ్యులు కె.హరిశ్చంద్రప్రసాద్, బి.రాములమ్మ, పి.రవీందర్​రావు, కావటి దశరథం, స్థానిక అంబేద్కర్​ యువజన సంఘం సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.