Breaking News

కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి..

కింగ్స్‌ పంజాబ్‌ ఇంటికి..

అబుదాబి: ఐపీఎల్‌ 13 సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్​ పంజాబ్‌ ఇక ఇంటిబాట పట్టింది. ఆదివారం చెన్నై సూపర్​కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లే ఆఫ్​ రేసు నుంచి వెళ్లిన రెండో జట్టుగా నిలిచింది. పంజాబ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసి 153 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్​ ఛేదించింది. డుప్లెసిస్‌(48; 34 బంతుల్లో 4×4, 6×2), రుతురాజ్‌ గైక్వాడ్‌(62 నాటౌట్‌; 49 బంతుల్లో 4×6, 6×1), అంబటి రాయుడు(30 నాటౌట్‌; 30 బంతుల్లో 4×2) రాణించారు. పంజాబ్​ బౌలర్​ జోర్డన్​ ఒక వికెట్​ తీశారు.
మొదట బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగింది. అగర్వాల్‌(26; 15 బంతుల్లో 4×5), రాహుల్‌(29; 27 బంతుల్లో 4×3, 6×1) స్కోరు బోర్డును నడిపించారు. క్రిస్‌ గేల్‌(12), పూరన్‌(2), మన్‌దీప్‌ సింగ్‌(14), నీషమ్‌(2) నిరాశపరచడంతో పంజాబ్‌ కష్టాల్లో పడింది. కానీ దీపక్‌ హుడా(62 నాటౌట్‌; 30 బంతుల్లో 4×3, 6×4) బ్యాట్‌ ఝుళిపించడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.