సారథి న్యూస్, షాద్నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంపు రామచంద్రారెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నాప్, హత్యకు గురయ్యారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డిని ఆయన బంధువైన అన్నారం ప్రతాప్ రెడ్డి మరొకరు కలిసి హత్య చేసినట్లు షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ వి.సురేందర్ వెల్లడించారు. తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన ప్రాధమిక పూర్వాపరాలను ఏసీపీ సురేందర్ కాసేపటి క్రితం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాకు వెల్లడించారు. మండలంలోని అన్నారం గ్రామంలో గల భూమికి సంబంధించిన వివాదం విషయంలో ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు నుండి ప్రతాప్ రెడ్డి మరో వ్యక్తి కలిసి రామచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వివరించారు. కొత్తూరు మండలం పెంజర్ల వద్ద రామచంద్రారెడ్డిని కత్తితో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. భూ వ్యవహారంలోనే హత్య జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉండగా అన్నారం గ్రామంలోని సర్వే నంబర్14 లో 9.09 ఎకరాల భూమికి సంబంధించి చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. రామచంద్రారెడ్డి బంధువైన ప్రతాప్ రెడ్డి ఇదే భూమి విషయమై చాలా కాలంగా గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూమికి సంబంధించి కొన్ని కేసులు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. ఈ భూమికి సంబంధించి మరో వర్గం ఇటీవల కాలంలో రంగప్రవేశం చేసినట్లు కూడా సమాచారం తెలుస్తోంది. అయితే రోజురోజుకు ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో శుక్రవారం రామచంద్రారెడ్డి అనూహ్యంగా కిడ్నాప్ కు గురయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో కిడ్నాప్ కు గురైన రామచంద్రారెడ్డి కొన్ని గంటల వ్యవధిలోనే పెంజర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఇదిలా ఉండగా నిందితులు పోలీసులకు లొంగిపోయారని సమాచారం. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మరిన్ని వాస్తవాలు పోలీసు విచారణలో తేలే అవకాశం ఉంది.
- June 20, 2020
- Archive
- క్రైమ్
- తెలంగాణ
- మహబూబ్నగర్
- CONGRESSS
- SHADNAGAR
- కాంగ్రెస్ నాయకుడు
- జడ్చర్ల
- Comments Off on కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి దారుణహత్య