Breaking News

కాంగ్రెస్​ నేతల దీక్షలు భగ్నం

  • ఎక్కడికక్కడే కాంగ్రెస్​ లీడర్ల అరెస్ట్​
  • పాశవిక పాలనకు పరాకాష్ట : ఉత్తమ్​

సారథి న్యూస్​, నెట్​వర్క్​: కృష్ణాజలాల పరిరక్షణ.. పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే డిమాండ్​ తో కాంగ్రెస్​ నేతలు మంగళవారం చేపట్టాలని భావించిన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఎల్లూరు రిజర్వాయర్ వద్ద దీక్ష చేయనున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి, కె.జానారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్​ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడ గంటపాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్​ఏ సంపత్ కుమార్ ను జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్​రెడ్డిని పోలీసులు కల్వకుర్తిలో అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ వద్ద నిర్వహించ తలపెట్టిన జలదీక్షకు వెళ్లకుండా మల్కాజ్ గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని కొడంగల్ పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కరివెన ప్రాజెక్టు వద్ద దీక్షకు వెళ్లకుండా టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జి. హర్షవర్ధన్ రెడ్డిని మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో హౌస్​ అరెస్ట్​ చేశారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్ నేతృత్వంలో వీర్లపల్లి శంకర్ తో పాటుగా కాంగ్రెస్ నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ కార్యదర్శి అనిరుధ్ రెడ్డిని ఉదయం ఐదు గంటలకే రంగారెడ్డిగూడాలో హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ బాలవర్ధన్ గౌడ్ ను ఉదయం అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్ట్​లను ఖండిస్తున్నాం..
తెలంగాణలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికం.. ఇంతకంటే దారుణం ఏమి లేదు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట.. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది.. ఆవిర్భావ దినోత్సవం నాడే హక్కులు కలరాస్తే ఎలా..? రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోంది. కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​లను ఖండిస్తున్నా..శాంతియుతంగా మేం చేసే కార్యక్రమాలను అడ్డుకోకూడదు.
– ఎన్​.ఉత్తమ్​కుమార్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు