Breaking News

కరోనా రోగుల వద్ద వసూళ్లు సహించబోం

కరోనా రోగుల వద్ద వసూళ్లు సహించబోం
  • బాధితుల పట్ల మానవత్వం చూపాలి
  • సెప్టెంబర్ 7లోగా పంటనష్టంపై అంచనాలు
  • వీడియో కాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​

సారథి న్యూస్​, కర్నూలు: ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దానికంటే.. కోవిడ్ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. బాధితుల పట్ల మానవత్వం చూపాలని హితబోధ చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా వరదలు, కోవిడ్19, పేదలకు ఇంటిస్థలాల పంపిణీ, ఉపాధి హామీ పథకం పనులు తదితర వాటిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని సూచించారు.
పంటనష్టంపై అంచనాలు
సెప్టెంబర్ 7వ తేదీలోగా పంటనష్టంపై అంచనాలు రూపొందించాలని సీఎం జగన్​ సూచించారు. గోదావరి వరద ముంపు బాధితులకు రూ.రెండువేలతో పాటు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్‌, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు, రెండు లీటర్ల కిరోసిన్‌ ఇవ్వాలన్నారు. నిత్యవసరాలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ వసతులు దెబ్బతిన్నచోట వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల క్లోరినేషన్ కోసం చర్యలు చేపట్టాలన్నారు.
త్వరలోనే ఇళ్లపట్టాలు పంపిణీ
ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని పునరుద్ఘాటించారు. రూ.22వేల కోట్ల విలువైన ఆస్తులను.. 30లక్షల మంది అక్కాచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయబోతున్నామని చెప్పారు. ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజీ క్లినిక్స్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో ప్రతివారం రూ.10 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. 55వేల అంగన్‌వాడీల్లో నాడు.. నేడు కింద పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
స్కూళ్ల పనులు కంప్లీట్​ చేయండి
సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలనే ఆలోచన ఉన్నందున.. అంతకంటే ముందే వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందించామని, బ్యాంకులకు ఈ డబ్బుపై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా సమస్యలు వస్తే కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపడానికి హిందూస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, పీఅండ్​జీ, రిలయన్స్, ఆమూల్‌, అలానా గ్రూపులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, రాష్ట్రస్థాయిలో ప్రతి 15రోజులకోసారి మంత్రుల బృందం రివ్యూ చేస్తుందని తెలిపారు.
రైతులకు సకాలంలో ఎరువులు
మండలాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎరువులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను పంపిణీ చేయాలని, ప్రతి రైతుభరోసా కేంద్రం పరిధిలో ఉన్న ఎకరా భూమిని గుర్తించాలని ఆదేశించారు.
రక్షణ బాధ్యత పోలీసులదే..
దళితులపై దాడులు, ఇతర ఘటనలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఎవరు తప్పు చేసినా తప్పేనని, చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు తప్పవన్నారు. సమాజంలో దిగువన ఉన్నవారికి రక్షణగా నిలబడాల్సిన బాధ్యత పోలీసులదేనని సూచించారు. అక్రమ మద్యం తయారీ, ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీ రవిపట్టన్ శెట్టి, జేసీ(అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్వో పుల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్న కలెక్టర్​, ఎస్పీ, ఇతర అధికారులు