బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్‌నంబర్లు, అడ్రస్ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. వాళ్లందరికీ కరోనా పాజిటివ్ అని తేలిందట. ఆ తర్వాత వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే.. చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు, మరి కొందరు తప్పుడు నంబర్లను ఇచ్చారు, ఇంకొందరు రాంగ్ అడ్రస్ లను నమోదు చేశారు. వీళ్లు టెస్టులకు వచ్చినప్పుడే రాంగ్ నంబర్లు ఇవ్వడం, అడ్రస్ లు తప్పు చెప్పడం వంటి పనులు చేశారని తీరా టెస్టులు పూర్తయ్యాకా తేలిందని బీబీఎంపీ వర్గాలు ప్రకటించడం గమనార్హం! బెంగళూరులో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోజుకు 1500 స్థాయిలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ అయినవాళ్లు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.