Breaking News

కరోనా కాలంలో కాసుల వేట


సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో అధికాదాయాన్ని పొందేందుకు ప్రైవేట్​ ఆస్పత్రుల యజమానులు పూనుకున్నారు. రోగుల నుంచి లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దానిగురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలోనూ ఈ ఆసుపత్రులు భారీగానే డబ్బులు వసూలు చేసేవి. కానీ, ఇప్పుడు కరోనా కాలం వారికి బాగా కలిసివచ్చింది. నిన్న మొన్నటి వరకు కరోనా చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేవి. టెస్టులు కూడా అక్కడే చేసేవారు. కానీ, ఇప్పుడు పరీక్షల నిర్వహణతో పాటు కరోనా చికిత్సలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా డబ్బులు లాగే పనిలో పడ్డారు.

కరోనా రోగికి ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తే ఎక్కువలో ఎక్కువ రోజుకు రూ.15వేలు కూడా ఖర్చు కాదు. కానీ, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పుడు రోగుల నుంచి రోజుకు రూ.80వేల దాకా వసూలు చేస్తున్నారు. ఇక మందులు, ఇతర టెస్టుల ఖర్చు సరేసరి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు ఎంత తీసుకోవాలో నిర్ణయించి అది అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.