సారథి న్యూస్, కర్నూలు: కరోనా కట్టడిలో పోలీసుల కృషి మరువలేనిదని ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి అన్నారు. మంగళవారం స్థానిక మినీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 24 మంది పోలీసు కానిస్టేబుళ్లు, సిబ్బందిని పూలమాలలతో కుటుంబసభ్యులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసుశాఖలో ఒత్తిడిని ఎదుర్కొని ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, కుటుంబాలకు న్యాయం చేస్తూ విధులు నిర్వహించారన్నారు. పోలీసు కుటుంబాల సహాయ సహకారాలు మరువలేనివన్నారు.
రిటైర్డ్ మెంట్ తర్వాత ఏవైనా సమస్యలు ఉంటే తమను నేరుగా సంప్రదించాలని సూచించారు. నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, డీఎస్పీలు బాబాఫక్రుద్దీన్, పి.రామకృష్ణ, వెంకటాద్రి, ఇలియాజ్ బాషా, మహబూబ్ బాషా, వెంకట్రామయ్య, పోలీసు సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.