Breaking News

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు.

జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు జయబాల్ సమావేశాల్లో పాల్గొన్నారు. బడ్జెట్ రోజున మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఆయనతో కాంటాక్ట్ అయిన మిగతా ఎమ్మెల్యేలు సైతం హోం ఐసోలైషన్‌లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ మెయిన్ హాల్‌ను శానిటైజ్ చేయాల్సి ఉండటంతో.. సమావేశాలను ఎక్కడ నిర్వహించాలనే విషయమై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ భవనం టాప్ ఫ్లోర్‌లో నిర్వహించాలని భావించినా.. చోటు చాలదనే కారణంతో చెట్టు కిందకు మార్చారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.