సారథి న్యూస్, ఎమ్మిగనూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జాతీయస్థాయిలో కరోనా కేసుల రికవరీ రేటు శాతం దాదాపు 69.29% ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10% తక్కువగా 60.8% నమోదవుతుందన్నారు.
కరోనా క్వారంటైన్ సెంటర్లలో రోగులకు సరైన ఆహారం లేక, సకాలంలో చికిత్సలు అందక బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఆదోని, నంద్యాల, విశ్వభారతి క్వారంటైన్ సెంటర్లలో బాధితుల ఆందోళనలు చూసి క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కూడా మాస్కు లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చుస్తే కరోనా వైరస్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు.