Breaking News

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

కరోనాకు ‘కళంకమే’ ప్రమాదం

సారథి న్యూస్​, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్​ జావెద్‌ సయ్యద్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్‌తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్‌కు గురై గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి కారణం కళంకమేనని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి .. నిరాశ, నిస్పృహకు లోనై.. ఇక తాను చనిపోతానన్న అపోహానికి గురవుతున్నాడని, అలా భయానికి గురికావొద్దని ఆయన సూచించారు.
‘కళంకం’ ప్రభావమెంత?
పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆత్మగౌరవం.. విశ్వాసం దెబ్బతీయడమేకాక.. వివక్షతపై తీవ్రప్రభావం చూపుతుంది. ఇది సమాజం నుంచి ఒంటరితనాన్ని పెంచుతుంది. సామాజిక ఉపసంహరణ, వెలివేయ బడ్డామనే భావన పెంచుతుంది. కరోనా వ్యాప్తిచెందుతుందేమోనన్న భయంతో మిత్రులు, కుటుంబసభ్యులు వారిని విస్మరించినపుడు కోపానికి, నిరాశ నిస్పృహకు లోనవుతారు. వారిపై ఇరుగుపొరుగు వారు, అపరిచితలు సూటిపోటి మాటలతో నొప్పించడం, ఆస్తులను ధ్వంసం చేయడం ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
వాస్తవాలు తెలుసుకుందాం
మలేరియా, డెంగీ, చికున్‌గున్యా లాంటి వ్యాధిలా ప్రజలు కరోనాను భావించడంలేదు.. ఇందుకు ప్రధాన కారణం భయం. సోషల్‌ మీడియా, న్యూస్‌ చానల్స్‌లో కరోనాపై వచ్చే వార్తలే ప్రామాణికంగా భావించవద్దు. పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేలా సోషల్‌ మీడియాను ఉపయోగించడం విచారకరం. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియాలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపయోగించాల్సిన మందు, తదితర ఎన్నో విషయాలు వస్తుంటాయి. కానీ అవన్నీ వాస్తవాలేనని భావించి.. ప్రాణం మీదకు తెచ్చుకోకూడదు. ఏది వాస్తవం.. ఏది అవాస్తవం.. అని వైద్యనిపుణుతో నిర్ధారించుకోవాల్సిన కనీస బాధ్యత మనపై ఉంది. తప్పు సమాచారంతో అపోహానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
‘పాజిటివ్‌’ వ్యక్తిని గౌరవిద్దాం
కోవిడ్‌ త్వరలో చరిత్ర అవుతుంది. కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు మానవత్వం, సోదరభావం అలాగే ఉంటాయి. కాబట్టి కళంకితులు అవుతున్న వారికి దయతో మద్దతు ఇవ్వండి. మానసికంగా లేదా ఆర్థికంగా లేదా మీకు తోచిన విధంగా వారికి సహాయం చేయండి. వ్యాధిబారిన పడిన చాలా మందికి మీ నుంచి చిరునవ్వు, శుభాకాంక్షలు అవసరం, మరేది కాదు.
ప్రతిష్టను దెబ్బతీయొద్దు
వైరస్‌ సోకిన వ్యక్తిని హేళన చేస్తూ వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎక్కడా మాట్లాడొద్దు. కుల సంఘాలు, మిత్రులు, మత పెద్దల వద్ద కరోనా రోగు గురించి దుష్ప్రచారం చేయొద్దు. మీ సంఘం, అపార్ట్‌ మెంటు, భవనంలోని ఈ రోగుల పట్ల గౌరవం, సానుభూతి చూపండి. వారిని సంరక్షించండి. మీకు వీలైతే రోజు వారి సపర్యు, నిత్యావసర సరుకులతో వారికి మద్దతు ఇవ్వండి.