సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్ లేకపోవడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి విద్యార్థులు టీవీలో ఆన్లైన్ క్లాసెస్ చూద్దామంటే ఉదయం నుంచి 11:30 గంటల వరకు కరెంట్ రాలేదు. షెడ్యూల్లో భాగంగా మంగళవారం మొదటిరోజు తెలుగు, భౌతికశాస్త్రం పాఠాలు వినాల్సి ఉంది. పాఠాలు వినకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. వీరికి ఎవరిలో కూడా స్మార్ట్ ఫోన్స్ లేకపోవడంతో ఉన్నప్పుడే టీవీలో చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో టీవీలు లేక, స్మార్ట్ ఫోన్లు లేక చాలామంది విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్‌కు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పాఠాలు వింటున్నారా? లేదా? అని పరిశీలించారు.
మొదటి రోజు ఆన్లైన్క్లాస్విందామనుకుంటే పొద్దటి నుంచి కరెంట్లేకపోవడంతో టీవీ చూడలేకపోయాను. మాకు ఫోన్‌కు కూడా లేదు. తెలుగు, భౌతికశాస్త్రం–2 క్లాసులను కోల్పోయాను. మున్ముందు కూడా కరెంట్లేకపోతే అన్ని క్లాసులు మిస్సవుతానేమోనని బాధగా ఉంది.
:: ఐశ్వర్య, 10వ తరగతి విద్యార్థిని, వెంకటాపూర్(ఆర్)