బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ‘గుంజన్ సక్సేనా, రూహిఅప్జానా, దోస్తానా 2’ సినిమాలు లైన్ పెట్టి చేస్తోంది. ఈ చిత్రాల్లో జాన్వీ ప్రధానపాత్రలో నటిస్తున్న ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది డిసెంబర్లోనే సినిమా పూర్తయినా పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. ఇక థియేటర్లను ఓపెన్ చేయడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు కావునా ఈ చిత్ర యూనిట్ వచ్చేనెల ఆగస్టు 12న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అధికారికంగా తెలిపింది.
జాన్వీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యుద్ధానికి వెళ్లిన భారతదేశపు మొదటి మహిళ గుంజన్ సక్సేనా కథతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినీ జర్నీ నాకెంతో స్ఫూర్తినిచ్చింది.. అదే విధంగా సినిమా చూసి మీరు కూడా ఫీల్ అవుతారని.. ఆగస్టు 12న మీ ముందు ల్యాండింగ్ అవుతున్నా..’ అంటూ పోస్ట్ చేసింది. ఈ బయోపిక్ గురించి జాన్వీ ఫ్లైట్ నడపడం.. యుద్ధ విద్యలు నేర్చుకోవడం .. లాంటి విషయాలు తెలినవే. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జీ స్టూడియోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో జాన్వీ తండ్రిగా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి నటించగా, మరొక నటుడు అంగద్ బేడీ జాన్వీకి సోదరుడిగా కనిపించనున్నాడు.