ముంబై: టీ20 ప్రపంచకప్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటేనే.. మిగతావన్నీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర టోర్నీలను పట్టాలెక్కించాలంటే మరికాస్త సమయం పడుతుందన్నాడు. సెప్టెంబర్–అక్టోబర్ విండో లభిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని, లేకపోతే కష్టమేనని చెప్పాడు.
‘ప్రపంచకప్‌పై ఐసీసీ ఏదో ఓ నిర్ణయం చెప్పాలి. వేచి చూడడం వల్ల ఎఫ్టీపీ మొత్తం దెబ్బతింటుంది. కరోనాతో చాలా సిరీస్‌లు రద్దయ్యాయి. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను రూపొందించుకోవాలంటే ఐసీసీ నిర్ణయం కీలకం. అవకాశం ఉంటే కచ్చితంగా ఐపీఎల్ నిర్వహిస్తాం. కాకపోతే సరైన విండో దొరకాలి. అది కూడా సెప్టెంబర్, అక్టోబర్ అయితేనే బాగుంటుంది. ఐపీఎల్ జరగకపోతే మాకు నాలుగువేల నష్టం వస్తుంది. బోర్డు, ప్లేయర్లపైనే కాకుండా దేశ ఆర్థికవ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. అలాగని మేం డబ్బు కోసం వెంపర్లాడడం లేదు. ప్లేయర్ల ఆరోగ్య భద్రత మాకు ముఖ్యం’ అని ధుమాల్ వ్యాఖ్యానించాడు.