Breaking News

ఐపీఎల్​కు మేం రెడీ


ముంబై: ఓవైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. తాము ఐపీఎల్​కు రెడీగా ఉన్నామని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు లేఖ రాశాడు. అభిమానులను అనుమతించకుండా, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నాడు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని దాదా తెలిపాడు.

‘ఈ ఏడాది ఐపీఎల్ కోసం బీసీసీఐ అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఖాళీ స్టేడియాల్లోనూ మ్యాచ్​లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. లీగ్ కోసం అభిమానులు, ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, ప్రసారదారులు, స్పాన్సర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు’ అని లేఖలో గంగూలీ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.
సెప్టెంబర్, అక్టోబర్​లో లీగ్
సెప్టెంబర్, అక్టోబర్ విండోలో ఐపీఎల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టంచేశాడు. అయితే టీ20 ప్రపంచకప్​పై తుది నిర్ణయం అధికారికంగా వెల్లడైతే తమ ఏర్పాట్లు మరింత వేగంగా సాగుతాయన్నాడు. ‘ప్రపంచకప్​పై లాంఛనమైన నిర్ణయం రావాలి. అప్పుడే ఐపీఎల్​కు సంబంధించి పూర్తి షెడ్యూల్​ను విడుదల చేస్తాం. ఇప్పుడైతే ప్రాథమిక ఏర్పాట్లను మొదలుపెట్టాలని అనుకుంటున్నాం’ అని పటేల్ పేర్కొన్నాడు. ఒకవేళ ఏదైనా కారణాలతో ఐపీఎల్​ ను భారత్​లో నిర్వహించడం కుదరకపోతే.. విదేశాలకు తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నాడు. ఎక్కడైనా టోర్నీ రెండు, మూడు వేదికల్లో మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశాడు.