Breaking News

ఏపీలో కులాల కుమ్ములాట


ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగ‌బ‌ద్ధమైన ప‌ద‌వుల‌ను ప్రభుత్వాలు గౌర‌వించాలి. వ్యక్తిగ‌త ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుప‌ర‌చిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ ప్రమాణం చేస్తారు. కానీ ఆచరణలో దాన్ని సహజంగానే పాటించరు. ఏపీలో ప్రస్తుతం కులాల కుమ్ములాట నడుస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ.. తమకు ఇష్టంలేని వారిని, ప్రధాన ప్రతిపక్షనేత సామాజికవర్గం వారిని టార్గెట్​ చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో కుల‌రాజకీయ‌మే ప్రధానపాత్ర పోషిస్తుందనేది అందిరికీ తెలిసిందే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనూ కులం ప్రాధాన్యత ఉన్నా.. తెలంగాణ‌లో కుల ప్రభావం కాస్త తక్కువగా ఉండేది. కానీ రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో కులరాజకీయాలు తెరమీదకు వచ్చాయి. కమ్మ, కాపు కులాలు ఏకం కావడంతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చంద్రబాబు చేసిన అనేక పొరపాట్లు ఆయనను ప్రజల నుంచి దూరం చేశాయి. ఒక దశలో ఆయన తన సామాజికవర్గానికి పెద్దపీట వేశారని ప్రజలంతా భావించే పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా భావించిన ప్రతిపక్షం ఈ విషయాన్ని ప్రజల్లోకి దూసుకెళ్లింది. ప్రజాసమస్యలపై తమదైన పంథాలో పోరాటాలు చేయడం.. ముఖ్యంగా జగన్మోహన్​రెడ్డి చేసిన పాదయాత్ర వైసీపీకి తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్​ కూడా చంద్రబాబులాగే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ హ‌యాంలో ఉన్నత హోదాలో ప‌నిచేసిన ఓ సామాజికవ‌ర్గానికి చెందిన అధికారుల‌పై జగన్​ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఐటీ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌రావు, ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగడ్డ ర‌మేష్‌కుమర్​ను ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా తొలిగించిదన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం చంద్రబాబుకు వీరు విధేయంగా ఉన్నారని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. కాగా జాస్తి కిషోర్‌కు కేంద్రం ప్రమోషన్​ ఇచ్చి జీఎస్‌టీ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్షన్​, నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ తొలగింపూ త‌ప్పంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాక‌రించింది. ప్రభుత్వం ఉద్దేశం స‌రిగా లేదంటూ త‌ప్పుబ‌ట్టింది. తుది విచార‌ణ‌ను మూడు వారాల‌పాటు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఇది కేవ‌లం వైఎస్సార్​ సీపీ హ‌యాంలోనే కాదు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సామాజికవ‌ర్గం మిగిలిన సామాజిక‌వ‌ర్గాల అధికారులు, నేత‌లు ప్రేక్షకులుగా ప‌వ‌ర్‌లేని శాఖ‌ల్లో మ‌గ్గారు. ఏ రాజకీయపార్టీ అధికారంలోకి వస్తే ఆపార్టీకి చెందిన సామాజికవర్గం వారు లబ్ధిపొందటం.. ప్రత్యర్థి సామాజికవర్గం వారు వివక్షకు, వేధింపులకు గురికావడం సాధారణమైపోయింది. ఏపీలో ఈ పరిస్థితి పోయి ప్రజాస్వామికపాలన రావాలని ఆశిద్దాం.