Breaking News

ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

ఏది ముట్టుకున్నా.. మంట మండుతోంది

  • ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
  • కరోనా ప్రభావంతో మార్కెట్లన్నీ బంద్​
  • ఇదే అదనుగా రేట్లు పెంచిన కూరగాయల వ్యాపారులు

సారథి న్యూస్, నర్సాపూర్: ‘వామ్మో.. గీవేం రేట్లు బిడ్డో. ముట్టకుంటే ధరలు మంట మండుతున్నయ్​. ఎట్ల కొనాలే.. ఎట్ల తినాలే..’ ఇది ఓ మహిళ ఆవేదన. ‘జేబు నిండ పైసలు తెస్తేనే గానీ కూరగాయలు సంచి నిండుతలేవ్​.. ఉప్పుపప్పులకే అంత బెడితే ఎట్ల బతకాలే. గీ రేట్లు ఎప్పుడు సూడలే’ ఇది ఓ మధ్యతరగతి ఉద్యోగి ఆందోళన. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కూరగాయలు ధరలు మండిపోవడంతో సామాన్యులు కొనలేక లబోదిబోమంటున్నారు. కూరగాయల వ్యాపారులు రేట్లను అమాంతం పెంచేశారు. ఏది కొన్నా కిలోకు రూ.వంద అవుతోంది. వెయ్యి రూపాయలు తీసుకెళ్తేగానీ సంచి నిండా కూరగాయలు రావడం లేదు. కరోనా మహమ్మారి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలని డాక్టర్లు సూచిస్తున్నారు దానికి అనుగుణంగా మంచి పోషకాలు ఉన్న కూరగాయలు కొందామంటే కొండెక్కి కూర్చున్నాయి.
కూరగాయల ధరలు(కిలో)ఇలా..
మెదక్​ జిల్లాలో నర్సాపూర్​, కౌడిపల్లి తదితర మార్కెట్లలో బీరకాయ కిలో రూ.120, టామాట కిలో రూ.80, బెండకాయ రూ.60, గోరుచిక్కుడు రూ.80, ఆలుగడ్డ రూ.80, పచ్చిమిర్చి రూ.90, క్యారెట్ రూ.80, వంకాయలు రూ.80, దొండకాయ రూ.80, క్యాబేజీ రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కాకరకాయను రూ.100 లెక్కన విక్రయిస్తున్నారు. ఇలా కూరగాయల రేట్లు పెరగడంతో సగం సగమే కొంటున్నామని కొనుగోలుదాలులు చెబుతున్నారు.
వారాంతపు సంత బంద్
కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రతి గురువారం వారాంతపు సంత నిర్వహిస్తారు. చాలా గ్రామాల నుంచి కూరగాయలు కొనేందుకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం వారంతపు సంత ను బంద్ చేయించారు. దీంతో కూరగాయలు కొనేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.


కూరగాయలన్నీ పిరం అయ్యాయి

కూరగాయలు కొందామంటే ధరలన్నీ ఫిరమయ్యాయి. చేసిన కూలీ డబ్బులు అన్ని కూరగాయలకు ఖర్చు అవుతున్నది. ముసుగు రోగం మొదలైన నుంచి అన్నిరకాల ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు కురుస్తుండడంతో పనులకు వెళ్తలేము. డబ్బులకు ఇబ్బంది ఉంది. అప్పులు చేసి మరీ కూరగాయలు కొంటున్నం.
:: భక్తుల మంగమ్మ, రాజీపేట


కొనాలంటేనే భయమేస్తోంది

అదేదో కొత్త రోగమంట. అది వచ్చి కూరగాయలు దుకాణాలు బంద్ చేసిన్రు. మేము కూలిపని చేసుకుంటాం. కూరగాయలు కొందామంటే రేట్లు పెంచిన్రు. ఏది కొనాలన్నా కిలోకు రూ.100 అయింది.
:: గాండ్ల బాలమణి రాజీపేట


తొక్కులతో పూట గడుపుతున్నం

మేం పుట్టినప్పటి నుంచి ఇలాంటి వింత రోగం సూడలేదు. ఈ రోగం రావడంతో అన్ని రేట్లు పెరిగినయ్​. కొనాలంటేనే భయమేస్తుంది. కొనలేం తినలేం. ఒక్కోరోజు తొక్కులు వేసుకుని పూట గడుపుతున్నం.
:: జక్కపల్లి అంజమ్మ, రాజీపేట


వర్షాల ప్రభావంతోనే రేట్లు

ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పాటు కరోనా ప్రభావంతో కూరగాయల రేట్లు బాగాపెరిగాయి. ఇక్కడ పండిన పంట దెబ్బతినడంతో హైదరాబాద్​ నుంచి తీసుకొస్తున్నం. బండి కిరాయి, మండిలో కూరగాయల రేట్లు పెరగడంతో మేం కూడా పెంచి అమ్మవలసి వస్తుంది.
:: వెంకయ్య, కూరగాయల వ్యాపారి