- మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి
సారథి న్యూస్, మెదక్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పనికల్పించాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఈజీఎస్ ఆఫీసర్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో 13 మండలాల్లో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి పనులు కల్పించాలన్నారు.
అటవీ భూముల్లో మొక్కలు నాటించాల్సిన బాధ్యత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అడిషనల్ ప్రాజెక్టు ఆఫీసర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లదేనని సూచించారు. భూగర్భజలాలు పెంచే పనులు చేయించాలని కోరారు. ఉపాధి, హరిత హారం పనులకు వచ్చే కూలీలు మాస్క్లు, సబ్బు, హ్యాండ్ శానిటైజర్లు వాడేలా చూడాలని, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ వో పద్మజారాణి, డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.