న్యూఢిల్లీ: చాలా తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్ యాప్‌ను ఇండియా బ్యాన్ చేయడంపై ఆ సంస్థ సీఈవో కెవిన్ మెయర్ మన దేశంలోని ఎంప్లాయీస్‌కు లెటర్ రాశారు. ఈ అంశంపై స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ‘వాటాదారులతో కలిసి సమస్యలను పరిష్కరించేందుకు చూస్తున్నాం. టిక్‌టాక్ భారతీయ చట్టం ప్రకారం డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది.
2018లో స్టార్ట్ అయిన ఈ టిక్‌టాక్ యాప్ ఇండియాలో దాదాపు 200 మిలియన్ యూజర్లను సంపాదించుకుంది. వాళ్లంతా వాళ్ల సంతోషాన్ని, సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌ను షేర్ చేసుకునేందుకు ఉపయోగించుకున్నారు. మా ఎంప్లాయీస్ మాకు పెద్ద స్ట్రెంత్, వాళ్లను సేఫ్‌గా చూసుకోవడం మా టాప్ ప్రియారిటీ. ఎంప్లాయీస్ సానుకూల అవకాశాలను పునరుద్ధరించే దిశగా మా శక్తి కొద్ది మేం ప్రయత్నిస్తాం. జాబ్స్‌కు గ్యారెంటీ ఇస్తాం. మీరు చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. డిజిటల్ ఇండియాలో యాక్టివ్ రోల్‌ప్లే చేసేందుకు కృషిచేద్దాం. లక్షలాది మంది యూజర్లు వాళ్ల టాలెంట్, క్రియేటివిటీని చూపించుకునేందుకు టిక్‌టాక్ బాగా ఉపయోగపడింది. దీని వల్ల చాలా మందికి చాలా మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిపల్లె, మారుమూల ఊళ్లలో కూడా ఫేమస్ అయింది’ అని ఉద్యోగులను ఉద్దేశిస్తూ మెయర్ లెటర్ రాశారు.
ఇండియాకు చెందిన యూజర్ల డేటా చోరీకి గురవుతుందనే ఆరోపణలతో చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసింది. వాటిలో టిక్‌టాక్ కూడా ఒకటి. కాగా.. ఇప్పటికే దానిపై టిక్‌టాక్ ఇండియా హెడ్ స్పందించారు. కాగా.. మన దేశంలోని స్మార్ట్ ఫోన్లలో ఉన్న టిక్‌టాక్ యాక్ పనిచేయడం ఆగిపోయింది.