Breaking News

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్
  • కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం
  • గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు

సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ సారి ఉపాధి కూలీల కనీస వేతనం పెంచింది. కరువు పరిస్థితులు, వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు ఉన్న ఊరులోనే ఉపాధి కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది తెలంగాణలో ఉపాధి కూలీల కనీస వేతనం రూ.211 ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం 2020 -2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి కూలీలకు ఇచ్ఛే వేతనాన్ని సవరించింది. ఈ మేరకు తెలంగాణలో కూలీల రోజువారీ వేతనం రూ.237గా నిర్ణయించారు. గత ఏడాది వేతనం తో పోలిస్తే ఇప్పుడు రూ.26 అదనంగా పెరిగింది. ఈ ఏప్రిల్ నెల నుంచి ఉపాధి పనులు చేసే కూలీలకు కొత్త వేతనం లభిస్తుంది.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,81,433 జాబ్ కార్డులు ఉన్నాయి. 2019- 2020 ఆర్థిక సంవత్సరంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 2,67,062 కుటుంబాలకు చెందిన 4,46,980 మంది కూలీలు ఉపాధి పనులు చేశారు. ఉమ్మడి జిల్లా మెదక్ వ్యాప్తంగా ఏడాదిలో కూలీలకు మొత్తం 1.61 కోట్ల పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా..1.26 కోట్ల పనిదినాలు కల్పించారు. డిమాండ్ ల సాధన కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేయడం, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చిలో కూలీలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా 34.44 లక్షల పనిదినాలు మిగిలిపోయాయి. గతేడాది కూలీల కనీస వేతనం రూ.211 కాగా, కూలీలు చేసిన పనులను బట్టి మెదక్ జిల్లాలో సరాసరి రూ.160.99, సంగారెడ్డి జిల్లాలో రూ.149.77, సిద్దిపేట జిల్లాలో రూ.166.64 వేతనం లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ సారి వేతనం పెంచ్చినందున కూలీలకు గతేడాది కంటే కొంత ఎక్కువ వేతనం లభించనుంది.

జిల్లా జాబ్ కార్డులు కూలీల సంఖ్య
మెదక్ 1,67615 3,79,963
సంగారెడ్డి 2,23,099 4,56,362
సిద్దిపేట 1,87,625 3,98,421