Breaking News

ఉన్నావో.. హ‌త్రాస్‌.. బ‌లరామ్ పూర్​

ఉన్నావో.. హ‌త్రాస్‌.. బ‌ల‌రాంపూర్‌

  • ఈ ఆగ‌డాల‌కు అంతే లేదా..?
  • ఇంకెంత మంది బ‌ల‌వ్వాలి..
  • ప‌రిహారంతో పాల‌కుల బాధ్యత తీరినట్టేనా?
  • నిందితుల‌కు స‌క‌ల స‌త్కారాలు
  • బాధితుల‌కు తీర‌ని వేదనలు

ల‌క్నో: మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హ‌త్రాస్‌కు చెందిన‌ ద‌ళిత యువ‌తిపై మ‌ద‌మెక్కిన న‌లుగురు అగ్రవర్ణ కామాంధులు అతికిరాత‌కంగా లైంగిక‌దాడి చేసి హ‌త్యాయ‌త్నానికి పాల్పడిన ఘ‌ట‌న మ‌రవ‌క‌ముందే.. ఆ చితి మంట‌లు ఇంకా చ‌ల్లార‌క‌ముందే మ‌రో యువ‌తి అత్యాచారానికి గురై ప్రాణాలు విడిచింది. ఘ‌ట‌న తీవ్రత, మీడియా క‌వ‌రేజీ, ఇత‌ర‌త్రా అంశాల‌ దృష్ట్యా.. లైంగిక‌దాడుల‌కు సంబంధించిన అన్ని ఘ‌ట‌న‌లు వెలుగులోకి రాక‌పోయినా.. దేశంలో ఏమూలకెళ్లినా మ‌హిళ‌లు భ‌ద్రంగా లేర‌నేది కండ్ల ముందు క‌నిపిస్తున్న క‌ఠోర‌ వాస్తవం. ఉత్తరప్రదేశ్​.. పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థను ఇంకా త‌న కాళ్ల మీద భ‌ద్రంగా మోస్తున్న రాష్ట్రాల్లో ఒక‌టి. ప్రపంచం 21వ శ‌తాబ్దంలోకి అడుగుపెట్టినా.. సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఆ రాష్ట్రం నుంచే ఎంద‌రో గొప్పవ్యక్తులు, విద్యావేత్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పుట్టుకొస్తున్నా అక్కడున్న వ్యవస్థను మాత్రం వారు ఏమీ చేయ‌లేక‌పోతున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో పెత్తందారులదే రాజ్యం. ముఖ్యంగా ద‌ళితులకైతే దినదిన‌గండ‌మే. ద‌ళితులు అభివృద్ధిలోకి రావ‌డం, వారు క‌డుపు నిండా తినడం, కొత్త బ‌ట్టలు క‌ట్టుకోవ‌డం, పెద్ద ఉద్యోగాలు పొంద‌డం అక్కడి గ్రామాల్లో ఇప్పటికీ నిషేధ‌మే. ద‌ళితుల పెండ్లి వేడుకలు పెద్దింటివారు ఉండే వాడ‌ల గుండా వెళ్లకూడ‌దు. ద‌ళిత పెండ్లికొడుకు గుర్రాన్ని ఎక్కకూడదు. ద‌ళిత యువ‌కుడు పోలీసు ఉద్యోగం సంపాదించినా.. గ్రామంలోని భూస్వామికి గులాం కావాల్సిందే.. ఇక ద‌ళిత జాతి మ‌హిళ అందంగా ఉంటే అది ఆమె చేసుకున్న పాపమే. ఉన్నట్టుండి అగ్రవ‌ర్ణాల కామాంధుల కండ్లు వారి మీద ప‌డ‌తాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదారుగురు కిరాత‌కుల ధృత‌రాష్ట్రుల కౌగిలిలో ఆమె న‌లిగిపోవాల్సిందే. ఇందుకు ఒక్క యువ‌తులే కాదు.. నాలుగేండ్ల ప‌సిపాప నుంచి డెబ్బై ఏండ్ల ముస‌లైనా స‌రే.. బ‌లిసినోళ్ల దాష్టీకాల‌కు బ‌ల‌వ్వాల్సిందే. ఈ దుర్మార్గపు వ్యవస్థలో బ‌లైపోయిన అభాగ్య యువ‌తులెంద‌రో.. ఉన్నావో, హ‌త్రాస్‌, బ‌ల‌రాంపూర్‌.. ఇవి వెలుగులోకి వ‌చ్చాయంతే..! రాని ఘ‌ట‌న‌లకు లెక్కేలేదు. వాటినెవ‌రూ ప‌ట్టించుకోరు. ప‌ట్టించుకున్న ప్రజలు ఈ భూమి మీద బ‌త‌క‌రు. అదంతే..!

హ‌త్రాస్‌లో ఏం జ‌రిగింది..?
ఉత్తరప్రదేశ్‌లోని హ‌త్రాస్ గ్రామానికి చెందిన ఒక‌ ద‌ళిత యువ‌తి (19).. సెప్టెంబ‌ర్ 14న త‌న త‌ల్లి, సోద‌రుల‌తో క‌లిసి ఇంట్లో ఉన్న ప‌శువులకు గ‌డ్డి కోసుకురావ‌డానికి వెళ్లింది. అమ్మ, సోద‌రుల‌కు దూరంగా ఒక మొక్కజొన్న చేను గ‌ట్టు మీద ఉన్న గడ్డి కోస్తోంది. ఎక్కడినుంచి వ‌చ్చారో.. ఎలా వ‌చ్చారో గాని.. ఉన్నత వ‌ర్గాల‌కు చెందిన న‌లుగురు వ్యక్తులు వేట‌కుక్కల మాదిరిగా ఆమె మీదప‌డ్డారు. ఆమె అరవ‌కుండా చున్నీని నోట్లో కుక్కి.. ప‌క్కనే ఉన్న చేనులోకి తీసుకెళ్లారు. న‌లుగురు రాక్షసులు చిత్త కార్తె కుక్కల్లా.. ఒక‌రి త‌ర్వాత ఆమెను రేప్ చేశారు. అదీ చాల‌ద‌న్నట్టు.. అత్యంత కిరాత‌కంగా ఆమె నాలుక‌ను కోసేశారు. న‌డుము విరిచి అక్కడి నుంచి ఉడాయించారు. కూతురు ఎంత‌సేప‌టికి క‌నిపించ‌క‌పోయేస‌రికి చేనులోకి వెళ్లి వెతికిన త‌ల్లికి అపస్మార‌క స్థితిలో ఉన్న కూతురును చూసి గుండెలు ప‌గిలిపోయాయి. రోదిస్తూనే.. ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె కోలుకోక‌పోవ‌డంతో ఢిల్లీలోని స‌ఫ్దర్ జంగ్​ హ‌స్పిట‌ల్‌లో వేశారు. సుమారు రెండు వారాల పాటు చావు బ‌తుకుల మ‌ధ్య పోరాడిన ఆ అభాగ్యురాలు.. చివ‌రికి మంగ‌ళ‌వారం ప్రాణాలు విడిచింది

పోలీసులేం చేశారు..?
హ‌త్రాస్ ఘ‌ట‌న ముందు వెలుగులోకి రాక‌పోయినా.. త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ వైర‌ల్ కావ‌డంతో బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. బాధితురాలి కుటుంబ‌స‌భ్యులు ఎంత చెప్పినా విన‌కున్నా.. స‌ర్వత్రా విమర్శలు రావ‌డంతో ప‌దిరోజుల త‌ర్వాత పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు. ఇదిలాఉండ‌గా.. చ‌నిపోయిన ఆ యువ‌తిని క‌డ‌సారి చూసుకుందామ‌నుకున్న బాధితురాలి కుటుంబ‌స‌భ్యుల‌కు నిరాశే మిగిలింది. ‘కొద్దిసేపు మా ఇంటి ద‌గ్గరికి తీసుకుపోతామ‌య్యా..?’ అని బ‌తిమిలాడుకున్న విన‌కుండా ఆగ‌మేఘాల మీద తీసుకొచ్చి ఆ మృత‌దేహాన్ని, నిజాన్ని కాల్చి బూడిద చేశారు.

రూ.25 ల‌క్షల న‌ష్టప‌రిహారం
బాధితురాలికి అన్యాయం జ‌రిగింద‌ని పాల‌కులు చాలా లేట్‌గా తెలుసుకున్నారు. ఆమె చ‌నిపోయిన త‌ర్వాత గానీ ప్రభుత్వంలో చ‌ల‌నం రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు ఊపందుకోవ‌డంతో పాల‌కులు రంగంలోకి దిగి.. ‘దోషుల‌ను వ‌ద‌లొద్దు’ అంటూ స్టేట్ మెంట్‌లు ఇచ్చారు, పోస్టులు పెట్టారు. ప‌నిలో ప‌నిగా.. ఆగ్రహజ్వాల‌లు చ‌ల్లార్చడానికి బాధిత కుటుంబానికి న‌ష్టప‌రిహారం ఎర‌వేశారు. అంతే.. ఇక ఈ కేసులో విచార‌ణ తేలేదెన్నడో..! నిందితులకు శిక్ష ప‌డేదెన్నడో ఆ భ‌గ‌వంతుడికే తెలియాలి.

ఆ మంట‌లు ఆరకముందే..
బల్‌రామ్‌పూర్ జిల్లాలో మరో దళిత యువతిపై సామూహిక లైంగికదాడి జరిగింది. హత్రాస్ బాధితురాలి మాదిరే ఈమె కూడా.. తీవ్ర గాయాలతో మరణించింది. వివరాలు.. 22 ఏళ్ల దళిత యువతి బల్‌రామ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఫోన్ చేసినా ఆ యువతి వైపు నుంచి స్పందన కరువైంది. చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఆటో రిక్షాలో అపస్మారక స్థితిలో యువతి ఇంటికి వచ్చింది. ఐతే ఆమె పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఒంటి నిండా గాయాలు కనిపించాయి. చేతికి గ్లూకోజ్ డ్రిప్ ఇంజెక్షన్ కనిపించింది. ఏదో జరిగిందని భయపడిపోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యలోనే ఆ యువతి మరణించింది. ఐతే చనిపోయే ముందు ఇద్దరు వ్యక్తుల పేర్లను తల్లిదండ్రులకు వెల్లడించింది. రేప్ కు ముందు తమ కూతురికి మత్తు ఇంజెక్షన్‌కు ఇచ్చారని.. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. రెండు కాళ్లను విరిచేసి.. రిక్షాలో పంపారని తెలిపింది.


ఇదీ భార‌తం..! ఇదే భార‌తం..!! ఇదేనా భార‌తం..?