Breaking News

ఉత్తరప్రదేశ్.. శభాష్​

ఉత్తరప్రదేశ్.. శభాష్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీ పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమైనా యూరప్‌ దేశాలతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీలో1,30,000 కరోనా మరణాలు సంభవించాయని, యూపీలో ఆరొందల మరణాలు నమోదయ్యాయని చెప్పారు.

‘యూరప్‌ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ మన దేశంలో ఒక్క యూపీ జనాభానే 24 కోట్లు. కానీ కరోనా వైరస్‌ను యూపీనే అద్భుతంగా కట్టడిచేసింది. ఆ దేశాల్లో 1,30,000 మరణాలు సంభవిస్తే ఇక్కడ 600 మంది చనిపోయారు. ఏదేమైనా మరణం మరణమే, ప్రతిఒకరి జీవితం ఎంతో విలువైంది. కష్టకాలంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు’ అని మోడీ అన్నారు.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే మాస్కులు వేసుకుని, రెండు గజాల దూరం పాటించాలని చెప్పారు. వలస కూలీలకు పనులు కల్పించేందుకు శుక్రవారం ఆత్మ నిర్భర్‌‌ ఉత్తర్‌‌ప్రదేశ్‌ రోజ్‌గర్‌‌ అభియాన్‌ ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాలు చెప్పారు.