Breaking News

ఇవాళ నా ఇల్లు.. రేపు మీ అహంకారం

ఇవాళ నా ఇల్లు.. రేపు మీ అహంకారం
  • మ‌హారాష్ట్ర సీఎంపై కంగ‌నా రనౌత్ ఫైర్

ముంబై: మ‌హారాష్ట్ర సీఎం ఉద్దవ్​థాక్రేపై బాలీవుడ్ న‌టి కంగ‌నా రనౌత్​ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు త‌న ఇల్లు కూలింద‌ని, రేపటి రోజున మీ అహంకారం కూలుతుంద‌ని ఆయ‌న‌పై ఫైర్ అయింది. ముంబైని పీవోకేతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన నేప‌థ్యంలో.. కంగ‌నా దేశ ఆర్థిక రాజ‌ధానిలో అడుగు పెట్టగానే ఈ వివాదం మ‌రింత రాజుకుంది. బీఎంసీ అధికారులు ఆమె కొత్తగా కొన్న ఇంటిని కూల్చివేసి కంగ‌నాకు షాకిచ్చారు. అయితే దీనిపై బొంబై హైకోర్టును ఆశ్రయించిన కంగ‌నాకు కాసింత ఊరట ల‌భించింది. అనంత‌రం ఆమె ఒక వీడియో సందేశం విడుద‌ల చేస్తూ.. ‘ఈరోజు నా ఇల్లు కూలింది. రేపు మీ అహంకారం కూలుతుంది’ అంటూ అగ్గిమీద గుగ్గిలమైంది. త‌న ఇంటిని కూల్చి మ‌హా స‌ర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింద‌ని, ఈ చ‌ర్యతో త‌న‌కు కాశ్మీరి పండిట్ల బాధ అర్థమైందని వ్యాఖ్యానించింది. నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా ఉంద‌నే ఆరోప‌ణ‌లతో కంగ‌నా ఇంటిని బీఎంసీ కూల్చివేసేందుకు సిద్ధమైంది. కాగా, ఈ ఇంటిని ఆమె ఇటీవ‌లే రూ.47 కోట్లతో కొనుగోలు చేసింది.
కంగ‌నా మ‌హా సీఎం అవుతుందేమో: ఆర్జీవీ

రాంగోపాల్​వర్మ, ప్రముఖ సినీనటి కంగనా రనౌత్​

కొద్దిరోజులుగా మ‌హా స‌ర్కారు, కంగ‌నా మ‌ధ్య రేకెత్తిన వివాదంపై సంచ‌ల‌న ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ట్విట్టర్​ వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ.. ‘ప‌రిస్థితి చూస్తుంటే కంగ‌నా మ‌హారాష్ట్ర సీఎం అయ్యేలా ఉంది. అదే జ‌రిగితే బాలీవుడ్ అంతా టింబక్‌ టూ (ప‌శ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో నైగ‌ర్ న‌ది ఒడ్డున ఉన్న ప్రాంతం) కు మ‌కాం మార్చాలి. కంగ‌నా సీఎం అయి, అర్ణబ్​గోస్వామి పీఎం అయ్యాక శివ‌సేన పార్టీ పూర్తిగా క‌నుమ‌రుగ‌వుతుంది’ అని ఆయన జోస్యం చెప్పారు. కరోనా ప్రబలిన భార‌త్‌, కంగ‌నా సోకిన శివ‌సేన‌కు వ్యాక్సిన్ లేద‌ని ఆర్జీవీ సంచలనాత్మ ట్వీట్ చేశారు.