కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్యాన్ ఇండియా మూవీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సెట్లో ఓ పెద్దక్రేన్ షూటింగ్ సెట్ పై పడి ఘోర ప్రమాదమే జరిగింది. తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేయక తప్పలేదు.
షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్న ఓ యువనటి తప్పుకుందని, అందుకోసం మరో హీరోయిన్ ను తీసుకున్నారని సమాచారం. ఆమె ఎవరో కాదు..‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగు వారికి బాగా పరిచయమైన హీరోయిన్ శృతిశర్మ. తర్వాతి షెడ్యూల్ నుంచి శృతిశర్మ కూడా షూటింగ్‌కు అటెండ్ కానుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో శృతి ఏ క్యారెక్టర్ చేయనుందన్న విషయంలో క్లారిటీ రాలేదు. అసలీ వార్త కూడా నిజమేనా అన్నది తెలియడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్‌తో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.