Breaking News

ఇంటికే కరోనా కిట్‌

షార్ట్ న్యూస్

సారథిన్యూస్​, హైదరాబాద్‌: హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్​కిట్​’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్​లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్‌లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్​ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఐసొలేషన్‌ అవస్థలను తప్పించడానికే..
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్​లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. రోగ లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉన్న బాధితులకు ఇంటివద్దే చికిత్స నందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఇంట్లో ఉండి చికిత్సపొందుతున్నట్టు సమాచారం. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. రెండు మూడు రోజులు గడిచే సరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి. ఒక్కసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత.. ఆ వ్యక్తి ఇంట్లోంచి బయటకు రావడానికి వీలుండదు. మరో మనిషి తోడు లేని పరిస్థితుల్లో మందుల కోసం బాధితుడే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తున్నది. దీని వల్ల సామాజిక వ్యాప్తి అధికమవుతున్నదని ప్రభుత్వం భావిస్తుంది. ఈనేపథ్యంలో వారికి అవకసరమైన మందులను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కరోనా బాధితులు 17 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా కిట్‌లో వస్తువులు, ఔషధాలను సమకూర్చనున్నారు.
పంపిణీ ఎలా..
మున్ముందు కేసుల తీవ్రత పెరుగుతుందనే ఆందోళన నెలకొనడంతో..భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బాధితుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారనే సమాచారాన్ని వైద్యాధికారులు నిర్ధారించుకోగానే.. సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వైద్యసిబ్బంది బాధితుని ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా సరే.. బాధితులందరికీ కిట్లను ఇస్తారు. నిత్యం వైద్యసిబ్బంది ఫోన్‌ ద్వారా వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంది. ఇలా బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలువనుంది.
కిట్‌లో ఏముంటాయి..
శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసిటమాల్​, యాంటి బయాటిక్​, విటమిన్​ సీ, ఈ, డీ,  లివోసెటిరిజైన్‌, ఎసిడిటీని తగ్గించే ట్యాబ్లట్స్​ వీటితో పాటు కోవిడ్​ వ్యాధికి సంబంధించి అవగాహన పెంచే పుస్తకం.