Breaking News

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ బౌలింగ్​లో సచిన్​ను ఎల్బీగా ఔటిచ్చా. కానీ బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. 2005 ఈడెన్లో అబ్దుల్ రజాక్ బౌలింగ్లో మాస్టర్ క్యాచ్ ఔటైనట్లు ప్రకటించా. కానీ బంతి బ్యాట్​ను తాకలేదని తేలింది. అప్పుడు లక్ష మంది ప్రేక్షకుల కేరింతల మధ్య నాకు ఏమీ వినబడలేదు. ఈ రెండు పొరపాట్లకు చింతిస్తున్నా. మనిషి తప్పులు చేయడం సహజం. వాటిని ఒప్పుకోవడం జీవితంలో భాగం’ అని ఓ రేడియో కార్యక్రమంలో ఈ మాజీ అంపైర్ అంగీకరించాడు.