- పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీపై టీఆర్ఎస్లో తీవ్ర కసరత్తు
- నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి దేశపతి శ్రీనివాస్
- హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి బొంతు రామ్మోహన్
సారథి న్యూస్, హైదరాబాద్: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి.. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆశావహులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఆయనకు అత్యంత సన్నిహితుడు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే తన పదవీకాలం కూడా ముగియనుంది. కావునా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన మంత్రి కేటీఆర్‌ను కోరినట్టు తెలిసింది. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి.. రామ్మోహన్‌కు హామీ ఇచ్చినట్టు వినికిడి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ బరిలోకి దిగితే.. ఆయనకు దీటుగా దేశపతిని నిలబెట్టాలని నేతలు పార్టీ పెద్దలకు సూచనప్రాయంగా తెలిపినట్టు సమాచారం. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతకుముందు తటస్థులు, మేధావులను నిలబెట్టి, వారికి మద్దతివ్వాలని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా పార్టీ తరఫున అభ్యర్థులకు బరిలోకి రంగంలోకి దించాలని నిర్ణయించినట్టు సమాచారం. ‘మనం గతంలో పాతూరి సుధాకర్‌రెడ్డి, దేవీప్రసాదరావును పార్టీ తరఫున నిలబెట్టకుండా పొరపాటు చేశాం. దానివల్ల కొంత నష్టపోయాం. అందువల్ల ఈసారి కచ్చితంగా టీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలి…’ అని తాజాగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల ఎంపికపై తుదినిర్ణయం సీఎం కేసీఆరే తీసుకోనున్నారు.
ప్రతిష్టాత్మకంగా ఓటరు నమోదు
మరోవైపు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతీ పట్టభద్రుడు తన ఓటును రిజిస్టర్ చేయించుకోవాలని కేటీఆర్ సూచించినట్టు తెలిసింది. ‘పట్టభద్రుల నియోజకవర్గ ఓట్లకు సంబంధించి మనం నాన్ సీరియస్‌గా ఉంటున్నం… నేను, మా ఆవిడ, మా చెల్లి కూడా ఓట్లను రిజిస్టర్ చేయించుకోలేదు. ఈసారి మేం కచ్చితంగా రిజిస్టర్ చేయించుకుంటం. ఇదే మాదిరిగా మన కార్యకర్తల్లోని ప్రతీ పట్టభద్రుడూ తన ఓటును రిజిస్టర్ చేయించుకోవాలి. వారి ఓట్లన్నీ మనకే పడే విధంగా చర్యలు తీసుకోవాలి..’ అని ఆదేశించినట్టు తెలిసింది.